హై డ్రామా : అంబేద్కర్ మనువడు అరెస్టు

పుణె : బాబా సాహెబ్ అంబేద్కర్‌కు వరుసకు మనువడయ్యే ప్రొపెసర్ ఆనంద్ తెల్ తుంబ్డేను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఫిబ్రవరి 02వ తేదీ శనివారం పుణె పోలీసులు అరెస్టు చేయడం…ఇది అక్రమమని.. తక్షణం ఆయన్ను విడుదల చేయాలని అదనపు సెషన్స్ జడ్జి కిశోర్ వదానే పోలీసులను ఆదేశించడంలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి పెద్ద హై డ్రామాయే నడించిందని చెప్పవచ్చు.
అసలు ఆయన్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది ? 2017, డిసెంబర్ 31వ తేదీన ఎల్గార్ పరిషద్‌లో ఓ సమావేశం జరిగింది. దీనికి ఆనంద్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మావోయిస్టుల మద్దతు ఈ సమావేశానికి ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ మీటింగ్‌లో ఆనంద్ ఉద్రేకపూరితంగా ప్రసంగించాడని..ప్రజలను రెచ్చగొట్టారని..ఈ నేపథ్యంలోనే కోరేగావ్ భీమా యుద్ధస్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతోనే ఆనంద్‌ని పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు. ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన్ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అదనపు సెషన్స్ జడ్జి విచారణ చేపట్టారు. ఆనంద్‌ను ఫిబ్రవరి 11 వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్నట్లు..అరెస్టు చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. నిర్దోషిగా నిరూపించుకొనేందుకు ఆనంద్‌కు సుప్రీంకోర్టు అవకాశమివ్వడం జరిగిందని తెలిపారు.