ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య : ఇప్పటిదాక 60 మంది మృతి

ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య : ఇప్పటిదాక 60 మంది మృతి

Updated On : January 10, 2021 / 11:12 AM IST

another farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమరీందర్ సంగ్ చనిపోయాడు. ఇప్పటిదాకా 60 మందికి పైగా రైతులు ఉద్యమంలో చనిపోయారు.

అటు సింఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లో…ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎనిమిదో విడత చర్చలు కూడా విఫలమవడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13,14 తేదీల్లో భోగి, మకర సంక్రాంతి సందర్భంగా సాగుచట్టాల ప్రతులను దహనం చేస్తామని రైతులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన మహిళా కిసాన్ దివస్ పేరుతో, 23వ తేదీన నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్ కిసాన్ పేరుతో ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అటు రైతుల డిమాండ్లపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని రైతులకు స్పష్టం చేసింది కేంద్రం. వ్యవసాయ చట్టాల రద్దు, రైతుల ఆందోళన పిటిషన్లపై 2021, జనవరి 11వ తేదీ సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.