పంజాబ్ లోకి పాక్ డ్రోన్…వేట ప్రారంభించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 12:52 PM IST
పంజాబ్ లోకి పాక్ డ్రోన్…వేట ప్రారంభించిన భారత్

Updated On : October 8, 2019 / 12:52 PM IST

సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన్ వైపు నుండి భారత భూభాగంలోకి దాదాపు ఒక కిలోమీటర్ దూరం అక్రమంగా ప్రవేశించిన డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే పంజాబ్ పోలీసులను బీఎస్ఎఫ్ అలర్ట్ చేయడంతో డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అంతేకాకుండా అంతర్జాతీయ సరిహద్దులోని పాకిస్తాన్ వైపు రాత్రి 10 నుంచి 10:40 గంటల మధ్య డ్రోన్లు అనుమానాస్పదంగా ఎగురుతున్నట్లు బీఎస్పీ సిబ్బంది చూశారు.

గత నెలలోపాకిస్థాన్ నుంచి హెవీ లిఫ్టింగ్ డ్రోన్‌లు భారత్‌లో ప్రవేశించి, పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏకే-47 రైఫిల్స్, శాటిలైట్ ఫోన్లు, గ్రెనేడ్లను,శాటిలైట్ ఫోన్‌లను ఎనిమిది ప్రాంతాల్లో దించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. 5 కిలోల పేలోడ్‌ను మోస్తున్న డ్రోన్‌లు గుర్తించకుండా ఉండటానికి వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లో మతపరంగా ప్రాధాన్యంగల ప్రదేశాలపై భీకర దాడులు చేయడం కోసమే ఈ ఆయుధ సామగ్రిని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పంపినట్లు అనుమానిస్తున్నారు.

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి పాక్ భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే. ఎల్ వోసీ వెంట పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలన్నింటినీ తిరిగి యాక్టివ్  చేసిందని,శీతాకాలం ప్రారంభానికి ముందు చొరబాటు ప్రయత్నాలు బాగా పెరుగుతాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రిపోర్ట్ చేశాయి. ఈ నెల మొదట్లో జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ రాష్ట్రంలో 200-300 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారని తెలిపారు.