Anurag Thakur: పశ్చిమ బెంగాల్, బిహార్‌లోనూ మహిళలను నగ్నంగా ఊరేగించారు.. మరి అక్కడికి మీరు వెళ్లరా?: కేంద్ర మంత్రి

మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.

Anurag Thakur: పశ్చిమ బెంగాల్, బిహార్‌లోనూ మహిళలను నగ్నంగా ఊరేగించారు.. మరి అక్కడికి మీరు వెళ్లరా?: కేంద్ర మంత్రి

Anurag Thakur

Updated On : July 22, 2023 / 4:32 PM IST

Anurag Thakur – MANIPUR: పశ్చిమ బెంగాల్(West Bengal), బిహార్‌(Bihar)లోనూ మహిళలను నగ్నంగా ఊరేగించారని, కానీ వాటి పట్ల ఎవరూ గళం విప్పలేదని, ఆందోళన వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వేళ తాజాగా దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

డబుల్ ఇంజన్ సర్కారు (కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అంటే ఇదేనేమో అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై అనురాగ్ ఠాకూర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

” పశ్చిమ బెంగాల్, బిహార్ కు కూడా విపక్షాలు తమ ప్రతినిధులను పంపి, మహిళల రక్షణ అంశాన్ని పరిశీలిస్తాయా? పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరులో ఉన్న ‘మమత’ ఆమెలో కొంచం కూడా మిగిలి లేదా? రాజస్థాన్ లో జరిగిన ఘటనలపై బాధ్యత తీసుకునే విషయాన్ని గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా?

వారి పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మహిళల రక్షణ గురించి మాట్లాడరా? పశ్చిమ బెంగాల్, బిహార్‌లో చోటుచేసుకున్న ఘటనలను మాత్రం మరో కోణంలో చూస్తారా? ” అని అనురాగ్ ఠాగూర్ ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, కొన్ని రాష్ట్రాల్లో కనీసం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.

బిహార్ లో జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక్క మాటా మాట్లాడడం లేదని విమర్శించారు. కాగా, పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో ఇద్దరు మహిళలను హింసించి, అర్ధనగ్నంగా ఊరేగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Manipur Violence: ఉన్మాదపు చర్యలపై ఆవేశ ప్రకటనలు.. మణిపూర్ ఘటనా నిందితుల తల తెచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తానన్న ఆచార్య మనీష్