మంత్రి వార్నింగ్: బీజేపీని విమర్శిస్తే వేళ్లు నరికేస్తాం

సార్వత్రిక ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ప్రత్యర్ధులపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మనోజ్ సిన్హా(59).. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని విమర్శించేవారిపై విరుచుకుపడ్డారు. తమ పార్టీపైన ఆరోపణలు చేసే వారి పనిపడతాం అంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ నేతల పనితీరును విమర్శిస్తూ ఆరోపణలు చేస్తే ఊరుకోబోం అని, ఎవరైనా వేలెత్తి చూపితే వారి వేళ్లు నరికేస్తాం అని అన్నారు. అవినీతిని నిర్మూలించడం, అక్రమ నగదు ప్రవాహం అడ్డుకోవడం కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుందని, ఇందుకోసం బీజేపీ ఎంతో కష్టపడుతుందని, అటువంటి బీజేపీని విమర్శించేవారి కళ్లు క్షేమంగా ఉండవని అన్నారు. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నా విమర్శించిన నాలుగు గంటల్లోపు వారి వేళ్లు నరికేస్తాం అంటూ ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు.