విపక్షాలపై షా ఫైర్…కేంద్ర పథకాల క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేస్తున్నారు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ప్రసంగించారు. సీఏఏ, ఎన్నార్సీపై ప్రజలను విపక్షాలు గందరగోళ పరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇతర విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి బిల్లుపై భ్రమలు కల్పించే పని ప్రారంభించి.. ఢిల్లీలో అశాంతి నెలకొల్పారని అమిత్ షా తెలిపారు.
దేశ రాజధానిలో ఆందోళనలు నిర్వహిస్తున్న తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌లను శిక్షించాల్సిన సమయం వచ్చిందని షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే ఈ గ్యాంగ్‌లు ఆందోళనలు నిర్వహిస్తున్నాయన్నారు. ఆందోళనలు చేస్తున్న వారి పట్ల ఢిల్లీ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కూడా షా విమర్శలు గుప్పించారు. కేంద్రం చేసిన పనులను తమవిగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
గత ఆదివారం ప్రధాని కూడా ఆప్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో,వాతావరణ కాలుష్యంపై పోరాటంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. ఆప్ సర్కార్ ప్రజలను మోసగించిందంటూ ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరికొన్ని వారాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్.