Pak ISI agents : పాక్ ఐఎస్ఐ మహిళల నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు…అలర్ట్ జారీ

భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది పాక్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు సోషల్ మీడియా ఖాతాలు తెరిచారని పంజాబ్ డీజీపీ చెప్పారు....

Pak ISI agents : పాక్ ఐఎస్ఐ మహిళల నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు…అలర్ట్ జారీ

pak honeytrap

Updated On : September 4, 2023 / 8:12 AM IST

Pak ISI agents : భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది పాక్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు సోషల్ మీడియా ఖాతాలు తెరిచారని పంజాబ్ డీజీపీ చెప్పారు. (Army officials alerted against fake social media profiles) కేవలం రెండు వారాల్లోనే పాక్ మహిళలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి 325 మందికి పైగా వ్యక్తులను సంప్రదించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. (fake social media profiles of ISI agents) పాక్ మహిళల పేర్లను సాధారణ భారతీయ స్త్రీ పేర్లను పోలి ఉన్నాయని దీని ద్వారా భాకతీయులను ఆకర్షించి ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఇలాంటి 12 నకిలీ పాక్ ప్రొఫైల్స్ ను బ్లాక్ చేశామని పోలీసులు చెప్పారు.

 

పాక్ మహిళల నకిలీ ప్రొఫైల్స్ …

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పాక్ మహిళల పేరిట నకిలీ ప్రొఫైల్‌లు కనుగొన్నారు. పాక్ మహిళల సోషల్ మీడియా ఖాతాలపై అధికారులు, పోలీసులు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర భద్రతా సంస్థలు సూచించాయి. ఇండో-పాక్ సరిహద్దుల్లోని పఠాన్ కోట్ ప్రాంతానికి కేవలం 26కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనికులు, పోలీసులు అప్రమత్తంగా ఉండి, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ అధికారి హెచ్చరించారు. పాక్ మహిళా ఏజెంట్లు ఛాటింగ్ చేయడం ప్రారంభించాక వారి అశ్లీల ఫోటోలు సర్కులేట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని పోలీసులు హెచ్చరించారు.

 

పాక్ హనీట్రాప్ కేసులెన్నో…

గత ఐదేళ్లలో ఇలాంటి నకిలీ ఖాతాల హనీట్రాప్ లో చిక్కి అధికారులు బలి అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఐఎస్‌ఐతో కీలక సమాచారాన్ని పంచుకున్నందుకు అధికారిక రహస్యాల చట్టం కింద వారిని అరెస్టు చేశారు. భారతదేశానికి చెందిన బ్రహ్మోస్ క్షిపణి రహస్యాలను జరా దాస్‌గుప్తాగా గుర్తించిన మహిళా ఏజెంటుకు లీక్ చేశారనే ఆరోపణలపై డీఆర్ డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్‌పై గూఢచర్యం కేసు నమోదు చేయడంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో కలకలం చెలరేగింది.

 

బ్రహ్మోస్ క్షిపణి రహస్యాల లీక్ 

బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టుపై అత్యంత రహస్య నివేదికను పాక్ ఏజెంటుకు చూపించినందుకు కురుల్కర్‌ను ఈ ఏడాది మే నెలలో అరెస్టు చేశారు. గతంలో ఐఎస్‌ఐతో కీలక సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై పలువురు అధికారులు అరెస్టయ్యారు. అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టయిన నిందితుల్లో ఎక్కువ మంది ఆర్మీ జవాన్లేనని తేలింది. డబ్బు ఆఫర్ చేసి, అసభ్యకరమైన ఆడియో, వీడియో కాల్‌లు చేసి మోసగించారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 

 ఎన్నెన్నో కేసులు…

ఈ ఏజెంట్లు డేటాను కూడా హ్యాక్ చేస్తున్నారు. కశ్మీర్‌లోని పఠాన్‌కోట్‌లో రెండేళ్ల వ్యవధిలో ఇలాంటి రెండు కేసులు నమోదయ్యాయి. పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లో ఆర్మీ జవాన్ అమర్‌పాల్ సింగ్ ఐఎస్ఐ తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు.

 

పాక్ మహిళల వలలో చిక్కవద్దు…

అంతకుముందు 2021 అక్టోబర్ 27వతేదీన హర్యానా నివాసి మన్‌దీప్ సింగ్‌ను గూఢచర్యం ఆరోపణలపై పఠాన్‌కోట్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి పోలీసులు అరెస్టు చేశారు. సునీల్ కుమార్ అనే ఎయిర్ ఫోర్స్ జవాన్‌ను కూడా ఇలాంటి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాక్ మహిళా ఏజెంట్ల వలలో చిక్కవద్దని కేంద్ర భద్రతా సంస్థలు తాజాగా ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులను అప్రమత్తం చేసింది.