ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు.. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు : మంత్రి అతిషి

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతుంది. దీనిపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు.. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు : మంత్రి అతిషి

Arvind Kejriwal will continue as Delhi CM, to run govt from jail: Atishi

Updated On : March 22, 2024 / 10:05 AM IST

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? లేదా అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read Also : Congress Third List : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి 5 స్థానాలు ఖరారు

మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి క్లారిటీ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయరని స్పష్టం చేశారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని అతిషి ధృవీకరించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఢిల్లీ సీఎంగానే ఉంటారు. ఆయన సీఎంగానే కొనసాగుతారు. కేజ్రీవాల్ రాజీనామా చేయరు. అవసరమైతే జైలు నుంచి పనిచేస్తారని మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

పార్టీ అధినేత అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్య ఏంటి? అని అతిషిని మీడియా ప్రశ్నించగా.. కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించామని అతిషి చెప్పారు. సీఎంగా కొనసాగుకుండా నిరోధించే చట్టం ఏది లేదన్నారు. ఆయనకు శిక్షపడలేదని, తమ లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారని తెలిపారు. ఈ రాత్రికి అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును కోరుతామని ఆమె పేర్కొన్నారు.

కొన్ని గంటల ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన 12 మంది సభ్యుల బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన్ను ప్రశ్నించి ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎంను అరెస్టు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

Read Also : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. భారీ భద్రత మధ్య తరలింపు