అయోధ్య కేసు: 5గురు జడ్జిలతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 11:15 AM IST
అయోధ్య కేసు: 5గురు జడ్జిలతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు

ఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ఐదుగురు  న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వ‌ంలోజస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూవీ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ కేసు విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయడానికి నిరాకరించిన న్యాయస్థానం..తాజాగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 
అయోధ్య వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలంటూ గత సెప్టెంబరు 27న విచారణ సందర్భంగా పిటిషనర్ కోరితే, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2:1 మెజార్టీతో తిరస్కరించింది. కాగా, ప్రస్తుతం ఏర్పాటుచేసిన రాజ్యాంగం ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులూ భవిష్యత్తుల్లో చీఫ్ జస్టిస్ పదవి రేసులో ఉన్నవారే కావడం విశేషం. 
జనవరి 4న అయోధ్య అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.