దేశ రక్షణలో ఎక్కడా రాజీపడకుండా మోదీ సర్కారు ఏం చేస్తోందో తెలుసా?

PM Modi: పైలట్‌తో పనిలేకుండా ఆటోమేటిగ్గా టేకాఫ్, ల్యాండ్ అయ్యే ప్రిడేటర్ అధునాతన యుద్ధవిమానాలను..

దేశ రక్షణలో ఎక్కడా రాజీపడకుండా మోదీ సర్కారు ఏం చేస్తోందో తెలుసా?

PM Modi

మేమెవ్వరిమీదా దాడిచేయబోం…ఎవ్వరి ప్రాంతాన్ని ఆక్రమించుకోం…. కానీ మా మీద ఎవరన్నా దాడులు చేస్తే.. భూమి, ఆకాశం, సముద్రం అన్న తేడాలేకుండా ఎక్కడినుంచైనా తిప్పికొడతాం. అన్నివేళల్లో యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. శాంతి ఒప్పందం అమలవుతున్న సమయంలోనైనా… సరైన రీతిలో సమాధానమిస్తాం. ప్రత్యర్థి దేశాలనుద్దేశించి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక ఇది.

దేశ రక్షణ విషయంలో కేంద్రం ఎక్కడా రాజీపడడం లేదు. అధునాతన ఆయుధాలు, సరికొత్త నిర్మాణాలు, భారీ బడ్జెట్‌తో శత్రుదేశాలను ఎదుర్కొనేందుకు సరికొత్తగా సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో నిరంతరం రెచ్చగొడుతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు అన్ని వ్యూహాలూ సిద్ధం చేసింది. ఐదోతరం ఫైటర్ జెట్లు రూపొందించుకోవడం దగ్గరినుంచి అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా టన్నెల్ ప్రారంభం దాకా అన్నీ…ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే.

డ్రాగన్ దుర్మార్గాలు
సరిహద్దుల్లో డ్రాగన్ దుర్మార్గాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్రమంగా మన భూభాగంలోకి చొరబడడం, సరిహద్దుల వెంట గ్రామాలకు గ్రామాలు నిర్మించడం, అధునాతన ఆయుద్ధాలు వాస్తవాధీనరేఖ దగ్గరకు తరలించి భారత్‌ను రెచ్చగొట్టడం….వంటివి ఎన్నో చేస్తూ ఉంటుంది చైనా ప్రభుత్వం.

ఓ వైపు శాంతిచర్చలంటూనే మరో వైపు తమ సైనికులను సరిహద్దులను దాటిస్తుంటుంది. భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామంటూనే అరుణాచల్‌ప్రదేశ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. అందుకే చైనా విషయంలో భారత్ ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించదు. చైనాకు చెక్ పెట్టేందుకు అస్త్ర్ర శస్త్రాలను సిద్దంగా ఉంచుకుంటోంది.

ఆత్మనిర్భరభారత్‌తో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. దేశ రక్షణ విషయంలో రాజీపడేదే లేదన్న సంకేతాలు పొరుగుదేశాలకు, ప్రత్యర్థిదేశాలకు గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించడంలోనూ, దాడులను తిప్పికొట్టడంలోనూ, కుట్రలకు, కుయుక్తులకు సరైనరీతిలో సమాధానం చెప్పడంలోనూ భారత్ గతంలో ఎన్నడూ లేనంత దృఢంగా వ్యవహరిస్తోంది. అధునాతన ఆయుధాల కొనుగోలు, రక్షణ ఒప్పందాలతో భారత్‌ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పకనే చెబుతోంది.

తిప్పికొడతాం..
భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని…నింగి, నేల, నీరు తేడా లేకుండా ఎక్కడినుంచైనా దాడులను తిప్పికొడతామని, భారత రక్షణరంగం అత్యంత పటిష్టంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. శాంతి అమలువుతున్న సమయంతో సహా ఎప్పుడయినా, ఎక్కడయినా తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రాఫెల్ యుద్ధవిమానాలు, బ్రహ్మోస్ ప్రయోగం, అమెరికా నుంచి కచ్చితత్వంతో కూడిన యుద్ధవిమానమైన ప్రిడేటర్ డ్రోన్లు వంటి అధునాతన ఆయుధాలను అమ్ములపొదిలో చేర్చుకుని బారత్ శక్తిమంతంగా కనిపిస్తోంది. మేక్ ఇన్ ఇండియా విధానంతో కొన్నేళ్లుగా ఆర్మీ అవసరాలకు సరిపడా ఆయుధాలను దేశీయంగానే తయారుచేసుకుంటోంది భారత్. ఈ క్రమంలోనే భారత్‌ ఐదోతరం ఫైటర్ జెట్ల డిజైన్‌కు, అభివృద్ధికి క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ ఇటీవల ఆమోదముద్రవేసింది.

DRDO వీటిని తయారుచేయనుంది. AMCAగా పిలిచే ఈ అధునాతన యుద్ధవిమానాలను తొలిసారి భారత్‌లో తయారుచేస్తున్నారు. ఇది రెండు ఇంజిన్లు ఉండే 25 టన్నుల యుద్ధవిమానం. భారత వాయుసేనలో మిగిలిన విమానాల కన్నా పెద్దది. AMCAలో 6.5 టన్నుల చమురు పట్టే ట్యాంకులు ఉన్నాయి. తేలికపాటి యుద్ధవిమానాలుగా పిలిచే LCAల తయారీకి క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ 2022లో ఆమోదం తెలిపింది. 9వేల కోట్ల ఖర్చుతో వాటి తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

యుద్ధ వాతావరణం
కొన్నేళ్లగా చైనా తరచూ భారత్‌ను రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగుతోంది. డోక్లామ్ వివాదం, గాల్వాన్ ఘర్షణ వంటి సమయాల్లో ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అయితే చైనాదెప్పుడూ వివాదాస్పద వైఖరే. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటోంది.

పైలట్‌తో పనిలేకుండా ఆటోమేటిగ్గా టేకాఫ్, ల్యాండ్ అయ్యే ప్రిడేటర్ అధునాతన యుద్ధవిమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి కారణం చైనా నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకే. అదేవిధంగా 2022 డిసెంబరులో చైనాలోని పలు ప్రాంతాలపై దాడులు చేయగలిగే అగ్ని-5 క్షిపణిని ఒడిశా తీరం నుంచి ప్రయోగించింది. ఐదువేల కిలోమీటర్ల ఆవల లక్ష్యాన్ని కూడా ఈ క్షిపణి చేధించగలదు. అలాగే ఇప్పుడు సరిహద్దుల్లో ప్రారంభించిన సేలా టన్నెల్‌… వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకంగా మారనుంది.

Also Read: ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రేపటిలోగా వివరాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక