సుప్రీంకోర్టుకి రైతులు…కొత్త చట్టాలతో కార్పొరేట్లకు రైతులు బలి

Bharatiya Kisan Union moves Supreme Court against farm laws నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని,తక్షణమే ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని గురువారం(డిసెంబర్-11,2020)భారతీయ కిసాన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ దాఖలు చేసిన పిటిషన్ లో భారతీయ కిసాన్ యూనియన్ ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసింది.
తగిన చర్చ లేకుండా కేంద్రం ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆ పిటిషన్ లో భారతీయ కిసాన్ యూనియన్ పేర్కొంది. నూతన వ్యవసాయ చట్టాలు రైతు కమ్యూనిటీకి నష్టం కలిగించేవని ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ చట్టాలు చట్టవిరుద్ధమని, నిరంకుశత్వంతో చేసినవని, వ్యవసాయోత్పత్తుల వ్యాపారీకరణ, ధరల పెరుగుదలకు బాటలు పరుస్తాయని పిటిషన్ లో భారతీయ కిసాన్ యూనియన్ పేర్కొంది .ఈ చట్టాలు అమలైతే దేశం నాశనమవుతుందని, కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉందని, ఒకేసారి ఎటువంటి నియంత్రణలు లేకుండా వ్యవసాయోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తారని పేర్కొంది. వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన ధరలకు హామీ ఇస్తున్న అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల వ్యవస్థ ధ్వంసమవుతుందని తెలిపింది. కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడవలసిన పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంది.
కాగా, నూతన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆందోళనలో పాల్గొంటున్నవారిలో ఎక్కువమంది పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఉన్నారు. అయితే, రైతులతో ఆందోళన విరమింపజేసేందుకు కేంద్రం పలుమార్లు రైతు సంఘాల లీడర్లతో చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు విఫలమవ్వడంతో ఇప్పుడు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన ఆగదని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. డిసెంబర్ 14న దేశ వ్యాప్తంగా ఆందోళన చేయాలని రైతు సంఘాలు రైతులను కోరాయి. చట్టాలను రద్దు చేయకుంటే రైల్వే ట్రాక్లను దిగ్బంధిస్తామని ఆల్టిమేటం జారీ చేశాయి రైతు సంఘాలు.
కాగా, వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, తక్షణమే రైతులు నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం(డిసెంబర్-11,2020)మరోసారి విజ్ఞప్తి చేశారు. చలికాలం,కరోనా పరిస్థితుల్లో ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తోమర్ తెలిపారు. రైతులు తక్షణమే ఆందోళనలు విరమించి..కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగానే ఉన్నట్లు తోమర్ తెలిపారు.