ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం
ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. వివాదాస్పద 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ(GNCTD)సవరణ బిల్లుకు సోమవారం(మార్చి-22,2021) లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Delhi2
Delhi ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. వివాదాస్పద ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ(GNCTD)సవరణ బిల్లుకు సోమవారం(మార్చి-22,2021) లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఢిల్లీపై పెత్తనం, అధికారాలకు సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ మధ్య నెలకొన్న వివాదంపై 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ వివాదం తేలకుండానే ఢిల్లీపై కేంద్రానికి మరింత పెత్తనం కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్టమెంట్‌లో ప్రవేశపెట్టగా తాజాగా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వమంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ అని, కార్యనిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన అభిప్రాయం తీసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ విధుల్లో.. వివిధ అంశాల్లో సందిగ్ధత, కోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం అనివార్యమైందని లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిని రాజకీయ బిల్లుగా పిలవవద్దని విపక్షాలను ఆయన కోరారు. జీఎన్సీటీడీ చట్టాన్ని 1991లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. దీంతో తక్కువ శాసన అధికారాలు ఇస్తూ.. ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారాలను లాక్కోవడమో, ఇవ్వడమో చేయటం లేదు. ఈ బిల్లు ద్వారా 1996 నుంచి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆప్ మండిపడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ.. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. తర్వాత సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు 1991లో ఎన్‌సీటీగా ఢిల్లీని గుర్తించి.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే, కేంద్రం ప్రతిపాదించిన తాజా సవరణలు.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆప్ ఆరోపిస్తోంది. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పోందటంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధాని ప్రజలను కేంద్రం అవమానపర్చడానికి ఈ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ద్వారా దిల్లీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారి దగ్గరి నుంచి అధికారాన్ని ఓడిపోయిన వారు లాక్కంటున్నారుని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్ విమర్శించింది.
అసలు ఏంటి ఈ బిల్లు
ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం అని అర్థం. ఢిల్లీ ప్రభుత్వం ఏదైనా చర్యలకు ఉపక్రమించినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం లేదా క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని అమలుచేయడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.