మా ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇన్నోవో కారు బహుమతి : బీజేపీ బంపర్ ఆఫర్

  • Published By: nagamani ,Published On : August 18, 2020 / 11:58 AM IST
మా ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇన్నోవో కారు బహుమతి : బీజేపీ బంపర్ ఆఫర్

Updated On : August 18, 2020 / 1:00 PM IST

తమిళనాడు రాజకీయాల్లో అయితే డీఎంకే..లేదా అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే అధికారంలో ఉంటాయి. కానీ తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ఎంట్రీ ఇవ్వాలని ఏనాటి నుంచో యత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తమిళరాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత మరణం నాటినుంచి బీజేపీ రాష్ట్రంలో పాగా వేయటానికి యత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే.



ఈక్రమంలో 2021లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని బీజేపీ అత్యంత జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనే టార్గెట్ గా పెట్టుకుంది. దీంట్లో భాగంగా జిల్లా నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. బీజేపీ అభ్యర్ధులను గెలిపించిన జిల్లా అధ్యక్షులకు ఇన్నోవా కారు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.



ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో తాము ప్రాతినిధ్యం వహించాలని బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇటీవల ఎల్‌ మురుగన్‌ జిల్లా కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..ఎంజీఆర్‌లాగే ప్రధాని మోదీ అంటే ప్రజల్లో ఎనలేని అభిమానం ఉందన్నారు.



రాష్ట్రంలో మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, ఆ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. పార్టీ పోటీచేసిన స్థానాల నుంచి అభ్యర్ధులను గెలిపించిన జిల్లా అధ్యక్షులకు ఇన్నోవా కారు బహుమతిగా ఇస్తామని మురుగన్‌ ప్రకటించారు. మురుగన్ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.