BJP Mission 2024 : మిషన్ 2024పై బీజేపీ ఫోకస్.. తెలంగాణ సహా 5రాష్ట్రాలపై గురి.. టార్గెట్ 144 వెనుక స్ట్రాటజీ ఏంటి?
మిషన్ 2024పై బీజేపీ ఫోకస్ చేసింది. విజయానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ..

BJP Mission 2024 : మిషన్ 2024పై బీజేపీ ఫోకస్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు సమావేశం అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ.. ఆ సీట్లను గ్రూప్ లుగా విభజించి కేంద్రమంత్రులకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించిన మంత్రుల బృందం గెలుపు గుర్రాలను గుర్తించి నివేదిక ఇచ్చింది. మంత్రుల బృందం గుర్తించిన అంశాలు, బలాలు, బలహీనతలపై సమీక్ష జరిపారు. ఇక 2024లో విజయానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు.
మిషన్ 2024పై ఫోకస్ పెట్టిన బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డులో మార్పులు చేసి తమ ఫోకస్ ఏంటో చెప్పేసిన కమలం పార్టీ ఇప్పుడు ఆ 144 స్థానాలపై కన్నేసింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలపై గురి పెట్టింది. గత ఎన్నికల్లో ఓడిన స్థానాల్లో విజయం సాధించి తీరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలన తారుమారు చేసిన బీజేపీ.. 2024లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేయబోతోందా? ఆ 144 స్థానాల మీద ప్రత్యేకంగా ఇంతలా ఎందుకు దృష్టి సారించినట్లు. 2024 కోసం బీజేపీ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి అడుగులు పడబోతున్నాయి?
2014 ను మించి 2019 ఎన్నికలు.. ఇక రాబోయే ఎన్నికలు అంతకు మించి అనిపించాలని ఫిక్స్ అయ్యారు బీజేపీ నేతలు. అందుకే టార్గెట్ 144 అంటున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్తాయిలో దృష్టిసారించిన కమలం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చేసి తమ దూకుడు ఎలా ఉండబోతోందో, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో ముందు పరిచయం చేసిన బీజేపీ.. ఇప్పుడా 144 పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతోంది.
2019 ఎన్నికల్లో తృటిలో చేజారిన స్థానాలు.. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన 144 నియోజకవర్గాలపై కమలనాథులు దృష్టి సారించారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి.
కేంద్ర మంత్రులతో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఎవరేం చేయాలి? ఎలాంటి అడుగులు వేయాలి? వ్యూహాలు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 144 స్థానాలను క్లస్టర్లుగా విభజించి ఒక్కో కస్టర్ కు ఒక్కో కేంద్ర మంత్రికి బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు.
అంచనాలకు మించి అన్నట్లుగా రెండుసార్లు తిరుగులేని ఆధిక్యతతో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి వీలుగా ప్లాన్ సెట్ చేస్తోంది. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే టార్గెట్ 144కు సిద్ధమయ్యారు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు గతంలో బీజేపీకి సపోర్ట్ గా నిలిచిన గుజరాత్, యూపీ, కర్నాటక రాష్ట్రాల్లో ఈసారి కమలం పార్టీ ఎంపీ స్థానాల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ 144 స్థానాలపై బీజేపీ నజర్ పెట్టింది. జస్ట్ మిస్ అన్నట్లు ఓడిపోయిన స్థానాలను 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని ప్లాన్ గీస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టింది బీజేపీ.