Bengal CM : బెంగాల్ నూతన సీఎంగా సువేందు అధికారి.. ప్రకటించిన BJP
Bengal CM : పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించనున్నారు.
bjp proposed suvendu adhikari as west bengal new cm
Bengal CM : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. అధికార టీఎంసీ (TMC) పార్టీని మట్టికరిపించింది. ఈ క్రమంలో తాజాగా బెంగాల్ సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండగా.. తాజాగా ఈ అంశంపై స్పష్టత వచ్చేసింది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సువేందు పేరును ప్రతిపాదించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ మీద ఏకంగా 15 వేల ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. త్వరలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
సువేందు అధికారి ప్రొఫైల్
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సువేందు అధికారి వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన 1970, డిసెంబర్ 15న జన్మించారు. ఆయన స్వస్థలం కర్కులి, పశ్చిమ బెంగాల్. రాజకీయ కుటుంబంలో జన్మించడం వల్ల బాల్యం నుంచే ఆయన పాలిటిక్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంచుకుంటూ వచ్చారు.
సువేందు తండ్రి శిశిర్ అధికారి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. అలాగే సువేందు అధికారి సోదరుడు దివ్యేందు అధికారి కూడా టీమ్ఎసీ (TMC) నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. ఆయన 2024లో బీజేపీలో చేరారు. మరో సోదరుడు సౌమేందు అధికారి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎంపీగా సేవలందిస్తున్నారు.
సువేందు అధికారి రాజకీయ జీవితం..
- 1995లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అడుగులు
- 1998లో తండ్రితో కలసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక
- 2006లో కంతి దక్షిణ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- అప్పటి వరకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ల నాన్నే.
- 2006-07 మధ్య సింగూర్, నందిగ్రామ్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సువేందు జీవితాన్ని మలుపు తిప్పిన ఉద్యమం ఇదే.
- 2009లో తొలిసారి లోక్ సభకు ఎన్నిక
- 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను కూలదోసి టీఎంసీ ప్రభుత్వం ఏర్పాటు
- 2016లో నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. తొలిసారి మమత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి
బీజేపీలో చేరిక..
2020లో టీఎంసీకి గుడ్‌బై కొట్టి బీజేపీలో చేరారు. టీఎంసీలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జోక్యం, ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఆరోపణలు చేస్తూ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2021లో బీజేపీలో చేరారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలవడంలో సువేందు కీలక పాత్ర పోషించారు. ఇక అదే ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతపై విజయం సాధించారు.
ఇక తాజాగా జరిగిన 2026 ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించడంలో సువేందు కీలక పాత్ర పోషించి విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాక, ఈ సారి భవానీపూర్‌లో మరోసారి మమతా బెనర్జీని ఓడించారు.
