Mask Rule Violators : మాస్క్ పెట్టుకోనివారి నుంచి ఒక్క సిటీలోనే రూ. 77కోట్లకు పైగా జరిమానా వసూలు
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్టోబర్-24,2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41,000 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు

Mask (1)
Mask Rule Violators కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్టోబర్-24,2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41,000 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం ప్రకటించింది. BMC డేటా ప్రకారం.. ముంబై పోలీసులు ఆదివారం 1316 కేసుల నుండి మొత్తం 2,63,200 రూపాయలు సేకరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులకు రూ. 200 జరిమానా విధించబడుతుందని ముంబై పోలీసులు గతంలో తెలియజేసిన విషయం తెలిసిందే.
మహమ్మారి ప్రారంభమైన ఏప్రిల్ 20, 2020 నుండి BMC జరిమానాలను వసూలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు గడిచిన 572 రోజుల్లో వసూలు చేసిన జరిమానాలు రూ.77 కోట్లు దాటినట్లు కార్పొరేషన్ వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో ముంబై నగరంలో ఫేస్ మాస్క్ నిబంధనలను ఉల్లంఘించినవారు సగటున రోజుకు 10,000 వరకు ఉన్నారని BMC తెలిపింది.
ఇక, BMC గత వారం కరోనావైరస్ ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, డ్రామా థియేటర్లు మరియు ఆడిటోరియంలను తిరిగి తెరవడానికి అనుమతించింది. ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించడం మరియు సామాజిక దూరం వంటి నిబంధనలతో వినోద కేంద్రాలు తెరవడానికి అనుమతించింది.
మహారాష్ట్రలో కరోనా పరిస్థితి
ఆదివారం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,410 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు,18 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 66,02,961కి, మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,40,016కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,894 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
ఇక, ముంబైలో ఆదివారం 408 కొత్త కోవిడ్ కేసులు మరియు 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో ముంబైలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,54,507 కి మరియు మరణాల సంఖ్య 16,213 కి చేరుకుంది.
ALSO READ NEET-PG Counselling : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీం బ్రేక్