అమానుషం, కరోనా మృతదేహాలను విసిరి పారేశారు

కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవేదనకు గురి చేస్తోంది. మృతులకు దక్కాల్సిన అంతిమ సంస్కారం కరోనా కారణంగా సంస్కార హీనంగా మారిపోయింది. కరోనా వైరస్ తో చనిపోయిన 18 మంది మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేస్తూ నిర్వహించిన సామూహిక అంత్యక్రియలు అందరి హృదయాలనూ కలిచివేసింది.
గొయ్యిలు తవ్వి అందులోకి మృతదేహాలు విసిరేశారు:
బళ్లారి కొవిడ్ ఆస్పత్రిలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు సోమవారం(జూన్ 29,2020) 12 మంది, మంగళవారం(జూన్ 30,2020) ఆరుగురు చనిపోయారు. గ్రామాల్లోని స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులే వారికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. గుగ్గరహట్టి దగ్గర తుంగభద్ర ఎగువ కాలువకు సమీపంలోని ఒక వంకలో పూడ్చడానికి మంగళవారం(జూన్ 30,2020) ఆ 18 మృతదేహాలను ఒక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. విడిగా సమాధి చేయకుండా పొక్లెయినర్‌తో రెండు పెద్ద గోతులు తవ్వారు. నల్లటి కవర్లలో చుట్టిన మృతదేహాలను గోతుల్లోకి విసిరేశారు. ఒక గోతిలో 8 మృతదేహాలు, మరొక గోతిలో 10 మృతదేహాలను పడేసి పూడ్చిపెట్టారు. గోతిలోకి మృతదేహాలను విసిరివేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
అమానవీయంగా అంత్యక్రియలు:
సాధారణంగా ఇలాంటి పరిస్థితిని మనం ఇప్పటి వరకూ విదేశాల్లోనే చూశాం. కానీ.. ఈ అంతిమ సంస్కారం వీడియోలు వైరల్‌గా మారడంతో భారత్ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోబోతోందనే ఆందోళన కలుగుతోంది. సాధారణంగా ఒక్కో మృతదేహాన్ని విధిగా గుంత తవ్వి అందులో పూడ్చాలి. కానీ సిబ్బంది మాత్రం రెండు పెద్ద గోతులు తవ్వడమే కాకుండా అందులోకి మృతదేహాలను విసిరేయడం దారుణం అంటున్నారు. మృతదేహాలను అమానవీయంగా గుంతలోకి విసిరేస్తూ అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బళ్లారి జిల్లా కలెక్టర్ నకుల్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతిమ సంస్కారాలకు ఆ నలుగురు కూడా దొరకని పరిస్థితి:
దేశంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఓ రకమైన భయం వెంటాడుతోంది. ఎవరైనా చనిపోయారని తెలిస్తే అటు వైపు అడుగేయడానికే జనం వణికిపోతున్నారు. అంత్యక్రియలకు ఆ నలుగురు కూడా దొరకని దారుణ పరిస్థితులు ఉన్నాయి. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు మరణించినా అనుమానంగా చూసే దుస్థితి నెలకొంది. ఇక ఆ మరణించిన వారు కరోనా మహమ్మారి కారణంగానే పోయారని తెలిస్తే ఇక గుండెల్లో దడే.
కుటుంబసభ్యులకు మరింత క్షోభ:
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో నెలకొన్న భయాలను పొగొట్టేందుకు కొవిడ్-19తో మరణించిన రోగుల అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరిగేలా చూడాలని కోర్టులు ఆదేశిస్తున్నాయి. అయినప్పటికీ.. అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో దారుణాలు జరిగిపోతున్నాయి. కనీస మానవత్వం లేకుండా.. కరోనా రోగుల మృతదేహాలను విసిరి పారేస్తున్నారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండగా మరింత క్షోభించేలా సిబ్బంది తీరు ఉంటోంది.
Karnataka’s laudable management of Covid19 comes under big question mark after video of mass burial of #COVID19 victims goes viral. This video is of Karnataka’s Bellari in which medical officers are seen dumping bodies into a pit. pic.twitter.com/1mP3v9g5fR
— Pinky Rajpurohit (ABP News) ?? (@Madrassan_Pinky) June 30, 2020