ఈ ఏడాది శీతాకాలం వెచ్చగానే: వాతావరణ శాఖ అంచనా

  • Published By: vamsi ,Published On : November 29, 2019 / 11:00 AM IST
ఈ ఏడాది శీతాకాలం వెచ్చగానే: వాతావరణ శాఖ అంచనా

Updated On : November 29, 2019 / 11:00 AM IST

కర్బన ఉద్గారాలు, కాలుష్య మేఘాల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు శీతాకాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట అధిక వేడి ఉంటుంది. మాములుగా అయితే శీతాకాలం నవంబరు చివరి వారంలో దేశమంతా గజ గజ వణికించే చలి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వాతావరణమే పెద్దగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది శీతాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే వేడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. కాలానుగుణ సగటు కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌కు పైగా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ ఏజెన్సీ చెబుతుంది. 

అధిక కాలుష్యం కారణంగా గాలుల ప్రవాహం సరిగా ఉండట్లేదని దీని వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ‘‘కాలుష్య మేఘాల వల్ల శీతాకాలంలో సైతం ఆకాశం మేఘావృతం అవుతోంది. పగటి పూట వేడెక్కిన భూమి.. వాతావరణం మేఘావృతమైనప్పుడు రాత్రిపూట తిరిగి త్వరగా చల్లబడదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఇదే కారణం అని ఐఎండీ చెబుతుంది.

వాహనాలు, పారిశ్రామిక కాలుష్యం వల్ల గాలిలోకి కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడుతున్నందునే నగరంలో స్వచ్ఛమైన చలి వాతావరణం ఉండటం లేదు. గాలిలో కర్బన వాయువులు అధికమైతే వాతావరణం బరువుగా మారి గాలుల కదలిక మందగిస్తుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రాబోయే మూడు నెలల్లో చలిగాలులు విషయమై ఈ మేరకు రిపోర్ట్ ఇచ్చింది భారతీయ వాతావరణ శాఖ. 

ఇక కోల్డ్ వేవ్ జోన్(సిడబ్ల్యుజెడ్) పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ మరియు జమ్మూ కశ్మీర్‌లలో మధ్య మహారాష్ట్ర, విదర్భ మరియు సౌరాష్ట్రలలో మాత్రమే చలిగాలులు వచ్చే అవకాశం ఉందని 

ఈ కోల్డ్ వేవ్ జోన్‌లలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ. డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుంది. అయితే, మిడిల్ ఇండియా, పశ్చిమ ప్రాంతాలతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు దక్షిణ జమ్మూ కాశ్మీర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉండవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.