Bhabanipur By-Poll : దీదీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికపై హైకోర్టు క్లారిటీ

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Bhabanipur By-Poll : దీదీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికపై హైకోర్టు క్లారిటీ

Bengal (1) (1)

Updated On : September 28, 2021 / 5:12 PM IST

Bhabanipur By-Poll వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఎన్నికను  రద్దుచేయడం కుదరదని, షెడ్యూల్​ ప్రకారమే సెప్టెంబరు 30న భవానీపుర్​ ఉపఎన్నిక నిర్వహించవచ్చని హైకోర్టు సృష్టం చేసింది.

కాగా, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి కింద భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ఈసీ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నిక వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను తాత్కాలిక సీజే జస్టిస్​ రాజేష్​ బిందాల్​, జస్టిస్​ ఆర్​. భరద్వాజ్​ సభ్యులుగా గల ధర్మాసనం మంగళవారం విచారించింది. విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తన వాదనలు వినిపించింది. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనే పదం అర్థాన్ని తప్పుగా వివరించడానికి పిటిషనర్ ప్రయత్నిస్తున్నాడని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదని అర్థం చేసుకోవాలని ఈసీ వివరించింది.

ALSO READ  భారత్‌ మరో రికార్డు.. ఒక్కరోజే కోటి మందికిపైగా టీకా.. ఇది 5వ సారి

ఇక ఉప ఎన్నికను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఇటీవల బెంగాల్ చీఫ్ సెక్రటరీ లేఖ రాయడాన్ని ఈ సందర్భంగా హైకోర్టు తప్పుబట్టింది. బెంగాల్​ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి.. ఈసీకి లేఖ రాయడం కూడా సరైనది కాదని తేల్చిచెప్పింది. భవానీపుర్​లో పోలింగ్​ జరగకుంటే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని, ఆ లేఖలో పేర్కొన్నారు సీఎస్​. అయితే ఉపఎన్నికను నిర్వహించాలని మాత్రమే ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యర్ధించారని బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది.

ఇక,భవానీపూర్ లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, బీజేపీ,కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల ప్రచారానికి హాజరైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు,పార్టీ ఎంపీ దిలీప్​ ఘోష్​ను టీఎంసీ కార్యకర్తలు అడ్డగించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ కనిపించటం కలకలం రేపింది. ఓటమి భయంతోనే దిలీప్ ఘోష్​పై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఉపఎన్నికను వాయిదా వేయాలని దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. భవానీపుర్​లో బీజేపీ ఎలాంటి బలం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.భవానీపూర్ లో సోమవారం జరిగిన ఘటనపై అదే రోజు సాయంత్రం 4 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించగా… దీనిపై స్పందించిన దీదీ సర్కారు ఘటన వివరాలు, వీడియో ఫుటేజీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. వీటిని ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపినట్లు సమాచారం.

ALSO READ  స్థిరమైన వ్యక్తి కాదని ముందే చెప్పా కదా..సిద్ధూ రాజీనామాపై కెప్టెన్

మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ..బీజేపీ నేత సువెందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె సీఎం బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ్, మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

భవనీపూర్ లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించారు. ఇక,మమతా బెనర్జీకి ప్రత్యర్ధిగా ప్రియాంక టైబ్రివాల్‌ను బీజేపీ నిలబెట్టింది. సీపీఐ నుంచి శ్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. ఇక,కాంగ్రెస్ ఎవ్వరినీ పోటీకి దించలేదు. సెప్టెంబరు 30 న భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. అక్టోబరు 3 ఫలితాలు వెల్లడికానున్నాయి. భవానీపూర్ తో పాటు పశ్చిమ్ బెంగాల్‌లో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా సెప్టెంబర్-30న ఉప ఎన్నిక జరగనుంది.