యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 02:17 PM IST
యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

Updated On : March 13, 2019 / 2:17 PM IST

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్ని తాను ఊరికే చెప్పడం లేదని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఆదివారం ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…కుమారస్వామి సీఎంగా ఉండడాన్ని అంగీకరించడం లేదన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ 16, కాంగ్రెస్ 9, జేడీఎస్ కు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సంకీర్ఱణ ప్రభుత్వం పడిపోతుందంటూ గతంలో కూడా యడ్డీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.