దేశంలో మరోసారి తెరపైకి రిజర్వేషన్ల అంశం..50 శాతానికి మించి ఇవ్వొచ్చా?

దేశంలో రిజర్వేషన్లు ఎంత ఉండాలి? 50 శాతం లోపు ఉండాలా? లేక 50 శాతానికి మించి ఉండాలా? ఇప్పుడు ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. దీంతో దేశంలో రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

దేశంలో మరోసారి తెరపైకి రిజర్వేషన్ల అంశం..50 శాతానికి మించి ఇవ్వొచ్చా?

Updated On : March 9, 2021 / 1:03 PM IST

reservations in the country : దేశంలో రిజర్వేషన్లు ఎంత ఉండాలి? 50 శాతం లోపు ఉండాలా? లేక 50 శాతానికి మించి ఉండాలా? ఇప్పుడు ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. దీంతో దేశంలో రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. 50 శాతం లోపు రిజర్వేషన్లు ఉండాలా? లేక 30 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందా? ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా? దీంతో పాటు మహారాష్ట్ర సర్కార్ ఆమోదించిన మరాఠాలకు కోటా చట్టం ఈ తీర్పునకు వ్యతిరేకమా? ఈ అంశాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల అభిప్రాయాలను కోరింది.

దేశంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని కూడా పునః పరిశీలించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అవసరమైతే కేసును మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని యోచిస్తోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారిన నేపథ్యంలో, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలను రాష్ట్రాలు కల్పించగలవా? లేదా? అనే అంశాన్ని ధర్మాసనం పరిశీలించనుంది. నిజానికి, విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, 16 శాతం కోటా ఇస్తే సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్లను మించిపోతోందని, ఇది సమర్థనీయం కాదని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.

మహారాష్ట్ర కోటా బిల్లుపై న్యాయస్థానాలు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది దేశవ్యాప్తంగా ఓబీసీ కోటాపై ప్రభావం చూపుతుందని, అందువల్ల, అన్ని రాష్ట్రాలనూ ఈ విచారణలో భాగస్వాములను చేసి, అభిప్రాయాలను తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, అభిషేక్‌ మను సింఘ్వి విజ్ఞప్తి చేశారు. అటార్నీ జనరల్‌ కూడా వారి అభిప్రాయంతో ఏకీకభవించారు. ఈ నేపథ్యంలోనే, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో ముస్లిములకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎస్సీలకు జనాభా దామాషా ప్రాతిపదికన పెంచుతామని చెప్పారు. ఈ మేరకు శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. వీటిని ఆమోదిస్తే రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోనుంది. కేవలం తెలంగాణలోనే కాదు… అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఇలాంటి బిల్లులు పెండింగులో ఉన్నాయి. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచుకునేందుకు ఆమోదించాలంటూ వినతులూ వస్తున్నాయి. సుప్రీంలో పిటిషన్లూ దాఖలయ్యాయి.

తమిళనాడులో ఇప్పటికే 60 శాతం వరకూ రిజర్వేషన్లు అమలవుతుండగా.. తమకూ కోటా పెంచాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు చేసుకున్నాయి. మొత్తానికి రిజర్వేషన్లపై వచ్చే తీర్పు భవిష్యత్తు తరాలకు అత్యంత కీలకం కానుంది. ఈ నెల 15న సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై మరోసారి విచారణ చేపట్టనుంది.