కాపాడండి అయ్యా…రాష్ట్రపతికి కేరళ విద్యార్థి లేఖ

కరోనాకు తోడు సముద్ర కోత వంటి సమస్యలు తన గ్రామాన్ని వేధించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కేరళలోని కొచ్చికి చెందిన పదో తరగతి విద్యార్థి సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. సమస్యను పరిష్కరించాడనికి చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు. సముద్ర తీరంలో గోడ కట్టించి తమను కాపాడాలని అభ్యర్థించాడు. ఎవరూ తమకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మా గ్రామం.. చెల్లెనం తీవ్రమైన విపత్తుల బారిన పడింది. మాకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు. నేను భయంతో ఈ లేఖ రాస్తున్నాను. వేసవి కాలం, రుతుపవనాల సమయంలో సముద్ర కోత వల్ల నీరు మా ఇంటి లోపలివరకు వరకు వస్తుంది. ఈ సంవత్సరం జులై 16 నుంచే సముద్ర కోత ప్రారంభమైంది. బంధువుల ఇంటికి వెళ్దామని అనుకున్నా మా ప్రాంతంలో కరోనా స్థానిక సంక్రమణం ఉండటం వల్ల వెళ్లలేకపోతున్నాం. భయంకరమైన అలలు చెల్లెనంలోని అన్ని ఇళ్లల్లోకి ప్రవేశించాయి. 400 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరు ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఇంట్లోని సామాగ్రితో పాటు నా పుస్తకాలు కూడా పోయాయి. రుతుపవనాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. మళ్లీ సముద్ర కోత సంభవిస్తుంది. చివరి ఆశ మీరే. అరేబియా సముద్రం భారత్కు ఓ సరిహద్దు. ఈ సరిహద్దులను కాపాడే బాధ్యత రాష్ట్రపతిది అని నేను చదువుకున్నాను. మీరే నా చివరి ఆశ. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకొండి. సముద్రం చుట్టు గోడ నిర్మించేలా చేసి మమ్మల్ని కాపాడండి అంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో సెబాస్టియన్ తెలిపాడు.
సమస్య పరిష్కారం కోసం తన తండ్రితో కలిసి ఎన్నో నిరసనల్లో పాల్గొన్నట్లు సెబాస్టియన్ వివరించాడు. తీరం వెంబడి గోడ నిర్మించి ఆ ప్రాంత వాసులను ఆదుకోవాలని చాలాసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టినట్లు చెప్పాడు. కానీ ఎవరూ తమకు సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
సెబాస్టియన్ లేఖపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే రాష్ట్రపతి నుంచి తనకు తప్పనిసరిగా స్పందన వస్తుందని సెబాస్టియన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.