కేంద్రం గుడ్‌న్యూస్?.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్… భారీగా తగ్గనున్న ధరలు.. రేట్లు తగ్గే వస్తువులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..

కేంద్రం గుడ్‌న్యూస్?.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్… భారీగా తగ్గనున్న ధరలు.. రేట్లు తగ్గే వస్తువులు ఇవే..

GST Relief

Updated On : July 3, 2025 / 8:07 AM IST

Central Govt GST Relief: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ శ్లాబులోని చాలా వస్తువులను 5శాతం శ్లాబులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే.. మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలకు భారీ ఉపశమనం లభించినట్లవుతుంది.

5శాతం శ్లాబులోకి తెస్తారా..?
కేంద్ర ప్రభుత్వం 12శాతం శ్లాబులోని వస్తువులను 5శాతం శ్లాబులోకి తీసుకొస్తే మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. తద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గినట్లవుతుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.40వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్ల వరకు భారం పడొచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి.. దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.

వీటి ధరలు తగ్గుతాయి..
ప్రస్తుతం 12శాతం శ్లాబ్ కింద టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెజర్ కుక్కర్, గీజర్, అల్యూమినియం, స్టీల్ తో తయారైన వంట పాత్రలు, వాషింగ్ మెషీన్లు (తక్కువ సామర్థ్యం ఉన్నవి), ఎలక్ట్రానిక్ ఇస్త్రీపెట్టె, సైకిళ్లు, నీటి ఫిల్టర్లు, శుద్ది యంత్రాలు (విద్యుత్ అవసరం లేనివి), సోలార్ వాటర్ హీటర్ లు, వాక్యూమ్ క్లీనర్లు (తక్కువ సామర్థ్యం), రూ. వెయ్యికిపైగా ధర ఉన్న రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుంచి రూ. వెయ్యి మధ్య ధర ఉండే పాదరక్షలు, స్టేషనరీ ఉత్పత్తులు, పలు రకాల టీకాలు, హెచ్ఐవీ, హైపటైటిస్, టీబీకి సంబంధించిన డయాగ్నోస్టిక్ కిట్‌లు, కొన్నిరకాల ఆయుర్వేదిక్, యునానీ ఔషధాలు, జామెట్రీ బాక్స్ లు, రెడీమిక్స్ కాంక్రీట్, కొన్ని రకాల వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం 12శాతం శ్లాబ్ లో ఉన్న ఈ వస్తువులను 5శాతం శ్లాబులోకి తీసుకొస్తే వీటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఎప్పుడు ప్రకటిస్తారు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది.