Tomato-Onion Prices : టమాట, ఉల్లిపై కేంద్రం కీలక ప్రకటన!

దేశవ్యాప్తంగా, టమాట, ఉల్లిధరలు మండిపోతున్నాయి. టమాట, ఉల్లి పంటలు దెబ్బతినడంతో తీవ్ర కొరత ఏర్పడింది. గతకొన్నిరోజులుగా ఉల్లితో పాటు టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి.

Tomato-Onion Prices : టమాట, ఉల్లిపై కేంద్రం కీలక ప్రకటన!

Central Govt Key Announcement On Tomato And Onion Prices

Updated On : November 26, 2021 / 7:29 PM IST

Tomato-Onion Prices : దేశవ్యాప్తంగా, టమాట, ఉల్లిధరలు పెట్రోల్ ధరల మాదిరిగా మండిపోతున్నాయి. టమాట, ఉల్లి పంటలు దెబ్బతినడంతో తీవ్ర కొరత ఏర్పడింది. గతకొన్నిరోజులుగా ఉల్లితో పాటు టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యుడి చుక్కులు చూపించాయి. టమాట, ఉల్లి ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ మేరకు ఉల్లి, టమాటపై కేంద్ర ఆహార ప్రజా, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నాటికి మార్కెట్లోకి టమాట నిల్వలు వచ్చి చేరుతాయని పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని కేంద్రం వెల్లడించింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ. 67 కు తగ్గనుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో టమాట ధర 63 శాతం వరకు పెరిగింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం ఏర్పడటంతో పాటు సరఫరాపై ప్రభావంతో ఒక్కసారిగా టమాట ధరలు ఆకాశాన్నింటాయి.

ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది. గతేడాది ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో టమాట దిగుబడి కాస్తా తగ్గింది. అయితే ఉల్లి నిల్వలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లి చేరుకుంది. సెప్టెంబర్‌లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట తీవ్రంగా దెబ్బతినడంతో దిగుబడి ఆలస్యమైందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లి ధర రూ. 39గా ఉంది.

గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లి ధర తగ్గిపోయింది. 2019, 2020 కంటే ఉల్లి ప్రస్తుత ధర తక్కువే.. ఉల్లి ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రం వద్ద 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల ఉల్లి ఉంది. ఇక్కడి నుంచే ఉల్లిని కేంద్రం విడుదల చేసింది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయి. రవాణా ఖర్చుతో కలిపి కిలో రూ. 26కు సరఫరా అవుతోంది.

ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రం అందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ. 164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసింది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటుచేసుకోవాలని కేంద్రం సూచించింది.

Read Also : Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ?