Netaji’s Picture On Currency : కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో..కేంద్రానికి 8 వారాల గడువు!

  కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాదిరిగానే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఫొటోలను కూడా ముద్రించాలని కోరుతూ

Netaji’s Picture On Currency : కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో..కేంద్రానికి 8 వారాల గడువు!

Currency

Updated On : December 14, 2021 / 3:43 PM IST

Netaji’s Picture On Currency :  కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాదిరిగానే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఫొటోలను కూడా ముద్రించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. బెంగాల్‌కు చెందిన 94 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు హరేంద్రనాథ్‌ బిస్వాస్‌ కోల్ కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వలేదని హరేంద్రనాథ్‌ బిస్వాస్‌ తన పిల్ లో ఆరోపించారు.

సోమవారం ఈ పిల్ పై కలకత్తా హైకోర్టులో విచారణ జరగగా..కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వైజే దస్తూర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఎనిమిది వారాల గడువు కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. దీనిపై ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది.

2017లో కేంద్రం దీనిపై వివరణ
2017లో కూడా ఓ పిల్ పై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఇదే విధమైన ప్రతిస్పందనను కేంద్రాన్ని కోరింది. అప్పుడు.. నోట్ల డిజైన్‌ను మార్చడం, ఇతర జాతీయ నాయకుల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఉంచడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ప్రతిస్పందనను కోరవలసి ఉంటుందని కేంద్రం సృష్టం చేసింది.

ఫిబ్రవరి 2021లో
ఈ ఏడాది ఫిబ్రవరిలో.. భారత కరెన్సీ నోట్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటోను ముద్రించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి అసమానమైనదని, అయితే పిటిషనర్ చేసిన ప్రార్థనను మన్నించలేమని కోర్టు పేర్కొంది.

నేతాజీ మరణంపై కూడా
మరోవైపు, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ఎన్నో వాదానలు వినిపిస్తుంటాయి. అయితే ఈ మిస్టరీపై కేంద్రం వైఖరి ఏంటని సోమవారం కోల్​కతా హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రెండు నెలల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. ఈ విషయంపై అఫిడవిట్​ దాఖలు చేయాలని నిర్దేశించింది. ఓ పిల్​పై సోమవారం విచారణ చేపట్టిన అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్​ శ్రీవాస్తవతో కూడిన బెంచ్​.. ఈ ఆదేశాలు జారీ చేసింది.

1941లో సొంత ఇంట్లో నుంచి మారువేషంలో ఆయన తప్పించుకున్నారు. ఆ తర్వాత దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అక్కడి వరకు సమాచారం ఉన్నా.. ఆ తర్వాత ఆయన మరణంపై అనేక ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. 1945 ఆగస్టు 18న జపాన్​లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని కొందరు భావిస్తున్నారు.

ALSO READ Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు