అంతా అస్సాం : కశ్మీర్ నుంచి భద్రతా బలగాల ఉపసంహరణ

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2019 / 09:38 AM IST
అంతా అస్సాం : కశ్మీర్ నుంచి భద్రతా బలగాల ఉపసంహరణ

Updated On : December 11, 2019 / 9:38 AM IST

జమ్మూకశ్మీర్ నుంచి పారామిలరీ బలగాలను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కశ్మీర్ వ్యాలీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)ను జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రం అస్సాంకు తరలించారు. కశ్మీర్ నుంచి మరో 10కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా అస్సాంకు తరలించనున్నట్లు సమాచారం. సెక్యూరిటీ సిబ్బంది అస్సాం చేరుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 

ఈ ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా వేలమంది భద్రతా సిబ్బందిని కశ్మీర్ కు తరలించింది ప్రభుత్వం. కశ్మీర్ లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రెండు రోజుల క్రితం పార్లమెంట్ వేదికగా కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. ఇవాళ(డిసెంబర్-11,2019)గౌహతిలో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  దిబ్రుఘర్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అక్కడ భారీగా సెక్యూరిటీని రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో కశ్మీర్ నుంచి పారామిలటరీ బలగాలను అస్సాంకి తరలించింది కేంద్ర ప్రభుత్వం.