Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?

భారత్ చంద్రయాన్-1 ప్రయోగాన్ని ఈ పద్ధతిలోనే చేపట్టింది. అలాగే, పలు దేశాలు చేపట్టిన 46 రకాల మిషన్లు ఈ పద్ధతిలోవే.

Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?

Chandrayaan-3

Chandrayaan-3 ISRO: చంద్రయాన్-3 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపడుతున్న విషయం తెలిసిందే. చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి చంద్రయాన్-3 ప్రాజెక్టు చేపట్టింది ఇస్రో.

చంద్రుడిపై భారత్ మూడోసారి ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం రెండో సారి ప్రయత్నం చేస్తోంది. చంద్రుడిపై రహస్యాలను ఛేదించేందుకు ఇప్పటివరకు అనేక రకాల మిషన్లను అమెరికా, రష్యా, చైనా కూడా చేపట్టాయి. ఇప్పటివరకు ఎలాంటి మిషన్లను చేపట్టారో చూద్దాం..

ఫ్లయిబైస్ (Flybys): అమెరికా 1958, డిసెంబరు 6న పయనీర్ 3 ప్రయోగం చేపట్టింది. 1959 మార్చి 3న పయనీర్ 4ను ప్రయోగించింది. అలాగే, సోవియట్ యూనియన్ లూనా 3 (Luna 3) మిషన్ ను 1959లో చేపట్టింది.

ఈ మూడు మిషన్లను ఫ్లయిబైస్ ప్రయోగాల పద్ధతిలో చేపట్టారు. అంటే, అంతరిక్ష వాహక నౌక చంద్రమామకు సమీపంలో వెళ్తాయి. అక్కడి నుంచే చంద్రుడిపై ఉన్న పరిస్థితులను పసిగడతాయి. అవి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లవు. అలా శాస్త్రవేత్తలు డిజైన్ చేస్తారు.

ఆర్బిటర్స్ (Orbiters): భారత్ చంద్రయాన్-1 ప్రయోగాన్ని ఈ పద్ధతిలోనే చేపట్టింది. అలాగే, పలు దేశాలు చేపట్టిన 46 రకాల మిషన్లు ఈ పద్ధతిలోవే. ఫ్లయిబైస్ ప్రయోగంలో వాహక నౌకలు చంద్రుడి కక్ష్యలోకి వెళ్లవని చెప్పుకున్నాం కదా.. ఆర్బిటర్స్ లో మాత్రం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తాయి. కక్ష్యలో నుంచి అక్కడి పరిస్థితులను పసిగడతాయి.

పరిశోధనలు చేయడానికి ఆర్బిటర్స్ నే అధికంగా వాడతారు. ఇప్పటివరకు చంద్రుడు, అంగారకుడు, శుక్ర గ్రహాలపై మాత్రమే ల్యాండింగ్ సాధ్యమైంది. చంద్రయాన్-2 మిషన్ కూడా ఆర్బిటరే. ల్యాండర్, రోవర్ కూలినప్పటికీ ఆర్బిటర్ పనిచేసింది.

ఇంపాక్ట్​ మిషన్ (Impact Mission): ఇంపాక్ట్​ మిషన్ ను ప్రధాన వాహకనౌకకు అదనంగా కలిపి పంపుతారు. ప్రధాన వాహక నౌక చంద్రుడిపై తిరుగుతున్న సమయంలో ఒకటి లేదా అంతకంటే అధిక సంఖ్యలో నియంత్రణ కోల్పోయి చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతాయి. అనంతరం అవి నాశమవుతాయి.

అయినప్పటికీ, పరిశోధనలకు ఉపయోగపడే సమాచారాన్ని పంపుతాయి. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (MIP-ఇంపాక్ట్​ మిషన్) ఇలాగే చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయింది. అయినప్పటికీ అది చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. క్రమాంకన లోపాల వల్ల (Calibration errors) ఆ సమయంలో కనుగొన్న విషయాలు పబ్లిష్ చేయడానికి నోచుకోలేదు.

ల్యాండర్స్ (Landers)​: చంద్రుడిపై వాహకనౌక సాఫ్ట్ ల్యాండింగ్ కావడంలో ఈ మిషన్ల ప్రమేయం ఉంటుంది. ఆర్బిటర్ మిషన్ల కంటే ల్యాండర్స్ మిషన్లు చాలా క్లిష్టతరం. మొదటిసారి చేపట్టిన 11 ల్యాండర్స్ వరుసగా విఫలమయ్యాయి. కాగా, చంద్రయాన్-2లో విక్రమ్‌ ల్యాండర్‌ వాడిన విషయం తెలిసిందే. అది క్యాష్ ల్యాండింగ్ వల్ల కుప్పకూలింది.

రోవర్స్ (Rovers): ల్యాండర్స్ మిషన్లకు అదనంగా రోవర్స్ ను కలిపి ప్రయోగం చేపడతారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన అనంతరం ముందుకు కదలకుండా స్థిరంగా ఉండిపోతుంది. అది ఆ పరిసరాల్లో తిరిగి పరిశోధనలకు సహకరించే అవకాశం ఉండదు. అందుకే, దానికి తోడుగా రోవర్స్ ను డిజైన్ చేసి పంపుతారు. వీటికి ప్రత్యేక చక్రాలు ఉండి, ల్యాండర్స్ అటూ ఇటూ తిరగడానికి సహకరిస్తాయి. చంద్రయాన్-2లో ప్రజ్ఞాన్‌ (Pragyaan) రోవర్‌ ను పంపిన విషయం తెలిసిందే. క్యాష్ ల్యాండింగ్ తో ఇది కుప్పకూలింది.

మానవ ప్రయోగాలు (Human missions): చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయోగాలు కూడా చేపడతారు. ఈ ప్రయోగాల్లో నాసా మాత్రమే విజయవంతమైంది. 1969-1972 మధ్య నాసాకు చెందిన ఆరు బృందాలు వెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇటువంటి ప్రయోగాలు జరగలేదు. 2025లో Artemis 3 మిషన్ ద్వారా మరోసారి ఈ ప్రయోగాన్ని చేపట్టడానికి నాసా ఏర్పాట్లు చేసుకుంటోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగం 2025లో జరుగుతోంది.

Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి ..

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమైతే దేశంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా?