Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమైతే దేశంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా?

భారత ఆర్థిక రంగం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఉద్యోగాలు ఎలా పుట్టుకొస్తాయి?

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమైతే దేశంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా?

Chandrayaan-3

Chandrayaan-3 ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపడుతుండడం ప్రపంచ దృష్టి మరోసారి భారత్ (India) వైపునకు తిరిగిందనే చెప్పుకోవాలి. చంద్రుడి మీద రహస్యాల ఛేదనకు ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంలో చంద్రయాన్-1, చంద్రయాన్-2తో ఎంతో అనుభవాన్ని గడించిన ఇస్రో భారత ఆర్థిక వ్యవస్థకు చంద్రయాన్-3తో మరింత తోడ్పడనుందని నిపుణులు చెబుతున్నారు.

అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది ఇస్రో. జాబిలి ఉపరితలంపై మరిన్ని పరిశోధనలు చేయడానికి చంద్రయాన్-3ని ఇస్రో పంపుతున్న నేపథ్యంలో స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సీఈవో పవన్ చందన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే.

చంద్రయాన్-3 విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరుతుందని పవన్ చెప్పారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయని అన్నారు.

పెట్టుబడుల వెల్లువ..
చంద్రయాన్-3 విజయవంతమైతే అంతరిక్ష సాంకేతికతలో భారత్ కు పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించవచ్చని పవన్ చెప్పారు.

చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసిన, అంతరిక్ష రంగానికి సంబంధించిన హార్డ్ వేర్, తక్కువ ధరకు కచ్చితమైన ఫలితాలను ఇచ్చే విడి భాగాల వంటి వాటికి ప్రచారం దక్కుతుందని తెలిపారు. ఇతర దేశాలు చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించిన హార్డ్ వేర్, విడి భాగాలకు భారత్ కు ఆర్డర్లు ఇస్తాయని చెప్పారు.

దీంతో వాటిని సరఫరా చేసే దేశంగా భారత్ మారుతుందని తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్ స్పేస్-టెక్ స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైతే విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యం ఏమీ ఉండదు. అంతరిక్షంలోని రహస్యాల అన్వేషణకు సంబంధించిన ప్రయత్నాలను చంద్రుడిపై చేసే పరిశోధనలు తదుపరి స్థాయికి తీసుకెళ్తాయని పవన్ చెప్పారు.

అంతరిక్షంలోని రహస్యాల అన్వేషణ విషయంలో చంద్రుడిపై చేసే పరిశోధనలు ఓ మార్గాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చని అన్నారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో రాణిస్తోన్న దేశాలు అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు రంగ పెట్టుబడుల జోక్యంతో కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తాయని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థిక రంగ బలోపేతానికి, ఆవిష్కరణలకు దారి తీస్తాయని తెలిపారు.

భారత స్పేస్ ఎకానమీ ఎంత?
భారత అంతరిక్ష రంగ ఆదాయం విషయంలో కొన్ని నెలల క్రితం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA), ఈ అండ్ వై (EY) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. భారత అంతరిక్ష రంగ ఆదాయం 2025లోపు దాదాపు రూ.1.055 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశాయి. 2020లో ఈ ఆదాయం దాదాపు రూ.79.3 వేల కోట్లుగా ఉంది.

ఉపగ్రహ సేవలతో పాటు అప్లికేషన్ల విభాగాల విషయంలో భారత్ భారీగా పుంజుకునే అవకాశం ఉంది. అలాగే, శాటిలైట్ తయారీ, గ్రౌండ్ సెగ్మెంట్, అంతరిక్ష రంగంలో ప్రయోగ సేవలు వంటి వాటిలో చంద్రయాన్-3 కారణంగా భారీగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశాలు ఉంటాయి.

ISRO Chandrayan-3 : జూలై నాటికి చంద్రునిపైకి చంద్రయాన్-3.. సురక్షిత ల్యాండింగ్‌పై దృష్టిపెట్టామన్న ఇస్రో చైర్మన్