Chandrayaan-3 Mission: చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం.. చంద్రుడికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్.. ఎన్ని కిలో మీటర్ల దూరంలో ఉందో తెలుసా?

చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆదివారం తెల్లవారు జామున 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా పూర్తిచేసింది.

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం.. చంద్రుడికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్.. ఎన్ని కిలో మీటర్ల దూరంలో ఉందో తెలుసా?

Chandrayaan-3

Chandrayaan-3: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. చంద్రుడి ఉపరితలం నుంచి విక్రమ్ ల్యాండర్ దూరం కేవలం 25 కిలో మీటర్లు మాత్రమే ఉంది. చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆదివారం తెల్లవారు జామున 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా పూర్తిచేసింది. ఇస్రో ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీటర్లు దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ భాగంలో ఉపరితలంపై దిగడమే తరువాయి అని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Chandrayaan-3: ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి.. చంద్రుడి ఫొటోలు పంపిన ల్యాండర్ విక్రమ్

ఇస్రో ట్వీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెండవ, చివరి డీబూస్టింగ్ ల్యాండర్ మాడ్యూల్ (ఎల్‌ఎం) కక్ష్యను 25 కిలో మీటర్లు x 134 కిలో మీటర్లకు విజయవతంగా తగ్గించడం జరిగింది. మాడ్యూల్ అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ల్యాండింగ్‌కు ఎంచుకున్న ప్రదేశంలో సూర్యోదయంకోసం వేచిచూస్తున్నాం. జాబిల్లిపై అడుగు పెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది అని ఇస్రో ట్విటర్‌లో పేర్కొంది.

Chandrayaan-3 vs Luna-25 : జాబిల్లిపైకి రష్యా ప్రయోగం వల్ల చంద్రయాన్‌-3కి ఇబ్బందులుంటాయా? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో అడుగు పెట్టేలా ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 ఒక్కో కక్ష్యను దాటుకుంటూ ఇస్రో అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోంది. ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు చంద్రయాన్ -3 నాలుగోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తిచేసింది. ఫలితంగా చంద్రయాన్-3 చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ సొంతంగా తిరగడం ప్రారంభించింది.

ఈనెల 18న మొదటి డీ-బూస్టింగ్ ప్రక్రియను ఇస్రో పూర్తి చేసింది. తాజాగా 20వ తేదీ (ఆదివారం) తెల్లవారు జామున 2 నుంచి 3గంటల మధ్య సమయంలో రెండో, చివరి డీ- బూస్టింగ్‌ ను విజయవతంగా పూర్తిచేసినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి విక్రమ్ ల్యాండర్ కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఉంది. మరో మూడు రోజుల్లో చంద్రుడిపై అడుగు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది.