Supreme Court : బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court : రాష్ట్రాల నుంచి పంపించిన పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే విషయంపై సుప్రీంకోర్టు కీలక ..
Supreme Court
Supreme Court : రాష్ట్రాల నుంచి పంపించిన పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.
రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ )పై సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల ఆమోదానికి గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఇక్కడ మరో కీలక విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులు వెనక్కి పంపలేరని, గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని ఆర్టికల్ 200 కింద వారికి విచక్షణ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: Danam Nagender : విచారణకు డెడ్‌లైన్ ముందు సెడెన్‌గా ఢిల్లీలో దానం నాగేందర్.. ఏం జరగబోతుంది..?
అసలేం జరిగిందంటే..?
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ పెండింగ్ లో పెట్టడంపై అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మూడు నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని, లేదంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ల విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద అధికారాలపై ఆరా తీసిన ద్రౌపది ముర్ము.. సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రపతి రిఫరెన్స్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విన్నది. ఈ బెంచ్‌లో జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు. తాజాగా.. రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. అయితే అకారణంగా బిల్లుల్ని పెండింగ్‌లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదంటూ తమ అభిప్రాయం వెల్లడించింది.
