కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేయం

కొత్త మోటారు వాహన చట్టం-2019ని పశ్చిమ బెంగాల్‌లో అమలు పరిచేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి రోజే మమతా ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలు చాలా దారుణంగా ఉన్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త మోటారు వాహన చట్టం జరిమానాలపై గుజరాత్ ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించడంతో దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడుతోందన్నారు. ఈ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కొత్త మోటారు వాహన సవరణ చట్టం ప్రజలను చాల ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పిన ఆమే పార్లమెంట్‌లోనే బిల్లును వ్యతిరేకించామని అన్నారు. ఇందులో జరిమానాలు ముఖ్యం కాదని ప్రజల అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల కోసం తీసుకువచ్చే చట్టాలు మానవత్వంతో కూడిన చట్టాలుగా ఉండాలని తెలిపారు.
ఫెడరల్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా చట్టం ఉన్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. డబ్బే సమస్యకు పరిష్కారం కాదని.. మానవతా ధృక్పథంతో ఆలోచించాలన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ పేరుతో ఉన్నతస్థాయి ప్రచారాన్ని చేపట్టిందని వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఆమే తెలిపారు.