డ్రాగన్ వక్రబుద్ధి : సరిహద్దులో 40 వేల మంది సైన్యం

సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది.
తూర్పు లడఖ్ వద్ద బలగాల వెనక్కి మళ్లింపునకు సంబంధించి తుది దశ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంక కంప్లీట్ కాలేదు. ఈ క్రమంలోనే..ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. చైనా సైనికుల కదలికలతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యింది.
తాము ఏ మాత్రం తీసిపోలేదని అదనపు బలగాలు, యుద్ధసామాగ్రీని అరుణాచల్ ప్రదేశ్ కు తరలిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతియుత ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాలను సమీకరిస్తోంది. పెద్ద మొత్తంలో తరలిస్తుండడంతో ఉత్కంఠ ఏర్పడుతోంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనంటూ..చైనా వాదిస్తోంది. దీనిని దక్షిణ టిబెట్ గా చెబుతోంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే..పశ్చిమాన తవాంగ్, తూర్పున వలోంగ్ మార్గాలున్నాయి.
తూర్పు లడఖ్ లోని ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లడానికి చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే ఫింగర్ 4 నుంచి కదిలేందుకు నిరాకరించిన చైనా… తాజాగా ఫింగర్ 5 వద్ద కూడా అదే మొండివైఖరి కనబరుస్తోంది. అండమాన్‌లో భారత్-అమెరికా నేవీ యుద్ధ విన్యాసాల కారణంగా చైనా బలగాలు ఫింగర్ 5నుంచి కదలడం లేదని అనుమానిస్తున్నారు.
ఈ నెల 29న రఫెల్ యుద్ధ విమానాలను అంబాలా లేదా లద్దాఖ్‌లో మోహరించనున్న నేపథ్యంలో కూడా చైనా బలగాలు ఫింగర్ 5నుంచి కదలడం లేదని తెలుస్తోంది. చైనా బలగాల తీరు చూస్తుంటే సైనిక కమాండర్ల మధ్య ఐదోసారి చర్చలు జరపాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
చైనాతో ఉద్రిక్తతల వేళ… భారత్ లద్దాఖ్ సరిహద్దులో మిగ్-29 ఫైటర్ జెట్ విమానాలను మోహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో చేపట్టే ఆపరేషన్లకు ఈ విమానాలను వాడబోతోంది. వీటిని నేవీ ఉపయోగిస్తోంది. 40 మిగ్-29 ఫైటర్ జెట్ విమానాలకు గాను ఇప్పటికే 18 విమానాలను ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై ఉంచారు. మిగతావి గోవా నేవీ బేస్‌లో ఉంచారు.