జూన్ లోనే 10,12వ తరగతి ఎగ్జామ్స్

Class 10, 12 board exams వెస్ట్ బెంగాల్ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో 10,12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ని జూన్ లో ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ బుధవారం(డిసెంబర్-23,2020)తెలిపారు. వచ్చే ఏడాది జూన్ లో 10వ తరగతి(మాధ్యమిక్)ఎగ్జామ్స్ ని మొదట నిర్వహించి..తర్వాత 12వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు చటర్జీ తెలిపారు.
కరోనా నేపథ్యంలో తరువాత రోజుల్లో ఎగ్జామ్ ల నిర్వహణపై వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన సూచనలను తాము అంగీకరించామని చటర్జీ తెలిపారు. అయితే, ఒకవేళ పరిస్థితి మారితే దానికి అనుగుణంగా బోర్డు మరియు కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు.
కాగా,సాధారణంగా బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఏటా ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరుగుతాయనే విషయం తెలిసిందే. అయితే, మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని చెప్పిన విషయం తెలిసిందే. బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో నిర్ణయిస్తామన్నారు.
అయితే, పరీక్షలను రద్దు చేసే ప్రశక్తే లేదని సృష్టం చేశారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఇబ్బందులు వస్తాయని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్న విద్యావకాశాలకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని అన్నారు. అందుకే పరీక్షలను రద్దు చేయకుండా.. ఆ తరువాత నిర్వహిస్తామని అన్నారు. దేశంలోని అనేక సీబీఎస్ఈ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్న నేపథ్యంలో… ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యంకాదని అన్నారు.