సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

వీరిద్దరు కూడా సుమారు నాలుగున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు.

సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

Delhi Liquor Policy Case : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ ఈడీ కేసు విచారణ జరిగింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. కేజ్రీవాల్, కవితలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి కోర్టుకు హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితలు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీలను రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం కేసు దర్యాఫ్తు పురోగతి దశలో ఉందని, ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ అయ్యాయని దర్యాఫ్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. దాంతో వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవిత, మార్చి 22న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. వీరిద్దరు కూడా సుమారు నాలుగున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఈడీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ ఆయన బెయిల్ బాండ్లను తీహార్ జైలుకి సమర్పించకపోవడంతో ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. వీరిద్దరూ కూడా లిక్కర్ పాలసీ అవినీతి సీబీఐ కేసులోనూ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు.

సీబీఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన కవిత, జూన్ 26వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇద్దరూ కూడా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సీబీఐ కేసులో హైకోర్టు బెయిల్ కు నిరాకరించడంతో.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత కూడా బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై దర్యాఫ్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఆగస్టు 20వ తేదీన కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరగబోతోంది. అలాగే కేజ్రీవాల్ సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ పై మెయిల్ పంపించాలని రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు సూచించడంతో త్వరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది.

Also Read : ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్