బాస్ అంటే నీలా ఉండాలి బాస్.. మూడేళ్లు కంపెనీలో పనిచేస్తే.. రూ.14 కోట్ల బోనస్..
ఉద్యోగులపై ఇంత ప్రేమ చూపించే బాస్‌లు దొరకడం అదృష్టమే.

ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లను వారు ఫెర్ఫాన్మెన్స్ టార్గెట్లను రీచ్ అవుతున్న విధానాన్ని చూసి, వారి నైపుణ్యాలను లెక్కగట్టి ఇస్తాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులు బాగా పనిచేస్తున్నప్పటికీ కనీసం జీతాలను కూడా పెంచవు.
అటువంటిది ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు మొత్తం రూ.14.5 కోట్ల బోనస్ ఇచ్చి వార్తల్లోకెక్కింది. ఇటీవల సెల్‌ఫోన్‌లో బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే తమకు ప్రతి నెల వచ్చే జీతం పడిందని చూసుకున్న ఉద్యోగులు.. భారీగా బోనస్ కూడా పడిందని తెలుసుకుని ఎగిరి గంతులు వేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కోవై.కో సంస్థ వ్యవస్థాపకుడు శరవణకుమార్ ఉద్యోగులకు అంత భారీ మొత్తంలో బోనస్‌ను ప్రకటించారు. 140 మందికి పైగా ఉన్న టీమ్ సభ్యులకు రూ.14.5 కోట్ల బోనస్ ఇచ్చారు. కోవై.కో అనేది ఓ సాఫ్ట్‌వేర్ యాస్ ఏ సర్వీస్ (SaaS) సంస్థ.
కోవై.కో సంస్థ వ్యవస్థాపకుడు శరవానా కుమార్ తమ సంస్థలో 2022లో “టుగెదర్ వీ గ్రో” అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు తమ సంస్థలో మూడు సంవత్సరాలు పనిచేస్తే వార్షిక వేతనం మీద 50 శాతం బోనస్ అందజేస్తామని అన్నారు.
తమ కంపెనీ అభివృద్ధి కోసం పని చేస్తున్న ఉద్యోగులపై తమకు నమ్మకముందని అన్నారు. కంపెనీకి లాభాలు దక్కినప్పుడు ఆ ప్రతిఫలం ఉద్యోగులకు కూడా దక్కాలని భావిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం చేసిన ఆ ప్రామిస్‌ను ఇప్పుడు ఆయన నెరవేర్చారు.
దీంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగులు. ఈ డబ్బును తాను తమ కూతురి విద్య కోసం పెట్టుబడి పెడతానని సీనియర్ గ్రోత్ మార్కెటర్ వెంకటేశ్ రెగుపతి శ్రీధరన్ చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు వచ్చిన బోనస్‌ను వాడుకుంటామని తెలిపారు.