కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్…కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
దీంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే కేవలం 7 సీట్లు మాత్రమే వెనుకబడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీఎస్పీ,ఎస్పీ,ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం (మార్చి 3)అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ కమల్ తెర పైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
మరోవైపు మధ్యప్రదేశ్ లో కనిపించకుండా పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ సైలెంట్ గా తమ పార్టీ అధికారంలో ఉన్న బెంగళూరుకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన హర్దీప్ దంగ్ ఇవాళ(మార్చి-5,2020)ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్ పీ ప్రజాపతికి పంపించారు.
రెండవసారి తాను ప్రజల ఆమోదం పొంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన పట్ల పార్టీ తరచుగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని తన రాజీనామా లేఖలో హర్దీప్ దంగ్ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వంలో భాగమైనందున మంత్రులు ఎవరూ పనిచేయడానికి సిద్ధంగా లేరని తన లేఖలో హర్దీప్ తెలిపారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ మొదటగా ఆకర్షించిన 10మంది ఎమ్మెల్యేలలో హర్దీప్ ఒకరు.
అయితే మంగళవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి గురుగ్రామ్ హోటల్ కి తరలించిన ఆరుగరు ఎమ్మెల్యేలను ఎలాగోలా బీజేపీ ఆపరేషన్ నుంచి కాపాడుకోగలిగామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బీజేపీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25-35కోట్ల వరకు ఆఫర్ చేస్తోందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 228. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 122 మంది సభ్యుల బలం ఉంది. మరోవైపు బీజేపీకి 107 మంది సభ్యుల ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114సీట్లు రాగా ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు,ఒక ఎస్పీ ఎమ్మెల్యే,నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటుగా ఇండిపెండెంట్లను కూడా ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మాదిరిగా జరిగినట్లయితే అతిత్వరలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ ఆపరేషన్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్నారు.