రాజకీయ సముద్రంలో ఎదురీది నిలబడ్డ రాహుల్‌.. తండ్రి, తల్లి తర్వాత అపోజిషన్ లీడర్‌గా యువనేత

Rahul Gandhi: ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీ యువనాయకుడిగా ఉన్న రాహుల్‌.. ఇక లోక్‌సభలో విపక్ష నేతగా..

రాజకీయ సముద్రంలో ఎదురీది నిలబడ్డ రాహుల్‌.. తండ్రి, తల్లి తర్వాత అపోజిషన్ లీడర్‌గా యువనేత

Rahul Gandhi

Updated On : June 26, 2024 / 9:29 PM IST

ఒకవైపు కమలం దూకుడు.. మరోవైపు కలిసిరాని కాలం.. రాజకీయ సముద్రంలో పదేళ్ల పాటు ఎదురీదారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పక్కనున్నవారు కూడా తనను నేతగా గుర్తించలేని పరిస్థితి నుంచి..రాహులే మా భవిష్యత్‌ నాయకుడని..కాబోయే ప్రధాని అని చెప్పుకునే స్థాయిలో నమ్మకం కలిగించారు. హస్తం పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు.

అవమానాలు, అనుమానాల నుంచి భవిష్యత్‌ నాయకుడు అనే భరోసా కల్పించే వరకు రాహుల్ రాజకీయ ప్రయాణం ఓ పొలిటికల్ మూవీకి మించిన స్టోరీ. ఫ్యూచర్‌ లీడర్‌గా పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీ యువనాయకుడిగా ఉన్న రాహుల్‌.. ఇక లోక్‌సభలో విపక్ష నేతగా.. ప్రజల తరఫున తన గళం మరింత గట్టిగా వినిపించనున్నారు.

పదేళ్లు కంటిన్యూగా..
పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్.. రాజకీయంగా ఎదిగే టైమ్‌లో తీవ్రమైన కష్టాలను చూశారు. ఏ స్థాయిలో అంటే ఉన్నట్లుండి పార్టీ పవర్‌ నుంచి దిగిపోవడం.. ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారిపోవడం.. నమ్మిన నేతలే నట్టేట ముంచడం.. ఐతే ఏ క్షణంలోనూ తను మాత్రం తలవంచలేదు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్.. పూర్తిస్థాయి రాజకీయ ఓనమాలు నేర్చుకునే టైమ్‌లోనే 2014లో కాంగ్రెస్‌ పవర్‌ను కోల్పోయింది. ఆ తర్వాత అంతా పోరాట బాటే.

పదేళ్లు కంటిన్యూగా పార్టీకి అధికారం లేకుండా పోయింది. అధికారమే కాదు ఏకంగా టెన్ ఇయర్స్ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక కాంగ్రెస్ పని ఖతమే..మోదీని ఢీకొట్టి నిలబడే సత్తా రాహుల్‌లో లేదన్న ప్రచారం జరిగింది. అతనో పప్పు, రాజీవ్‌గాంధీ లాంటి మాట తీరు లేదు.. సోనియా గాంధీ అంత పట్టుదలతో పనిచేయలేడు.. నాయనమ్మ ఇందిరాగాంధీ అంత డైనమిక్ కాదంటూ ఎన్నో విమర్శలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు రాహుల్.

ఇలా పదేళ్ల పాటు పొలిటికల్ జర్నీలో ఎన్నో సినిమా కష్టాలు చూశారు రాహుల్.. పార్టీకి అధికారం ఉనన్నీ రోజులు పవర్‌ను ఎంజాయ్‌ చేసి.. అధికారం పోగానే ఒక్కొక్కరు దూరం అయ్యారు. ఏకంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా ఓ కూటమి పెట్టారు. తామే లీడర్లమని..తమను కాదని పార్టీని ఎవరూ నడిపించలేరన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు సీనియర్లు.

ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
ఆ సమయంలో రాహుల్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు బలమైన అధికార పార్టీ..మరోవైపు పార్టీకి వెన్నముక లాగా ఉన్న లీడర్లంతా తలోదారి పట్టడంతో డైలమాలో పడ్డారు రాహుల్. ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా గట్టెక్కి.. యువరక్తాన్ని ప్రోత్సహించడంలో సక్సెస్ అయ్యారు.

పార్టీకి వెన్నంటి ఉన్న సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే.. కొత్తతరం రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు రాహుల్. 2019లో పార్టీ ఘోర ఓటమితో పాటు..ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.. దీంతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తర్వాత కొన్నాళ్ల పాటు సోనియా పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ఆ తర్వాత గాంధీ కుటుంబయేతర నేతను కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయాలనేది రాహుల్ ఆలోచన నుంచే పుట్టింది.

కాంగ్రెస్ అంటే వారసత్వం, కుటుంబ పాలన అని బీజేపీ చేసిన విమర్శలను తిప్పి కొట్టేందుకు.. కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ను అధ్యక్షుడిగా నియమించాలని ఫిక్స్ అయ్యారు. మొదటగా అశోక్‌ గెహ్లాట్‌ పేరును పరిశీలించి..అది కుదరకపోవడంతో మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ చీఫ్‌గా చేయడంలో రాహుల్ గాంధీ కీరోల్ ప్లే చేశారు.

భవిష్యత్ లేదనే పరిస్థితి నుంచి పోరాడి నిలిచాడు రాహుల్. దేశవ్యాప్తంగా ఊరూరా పార్టీని నమ్ముకుని.. జెండాను మోస్తున్న ప్రతీ కార్యకర్తకు, నేతకు నమ్మకం కలిగించాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమితులు అయ్యారు. ఇండియా కూటమి నేతలు రాహుల్‌ను ఏకగ్రీవంగా విపక్ష నేతగా ఎన్నుకున్నారంటేనే.. అపోజిషన్ విజయంలో ఆయన కష్టమెంతో అర్థం చేసుకోవచ్చు.

పదేళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా
కాంగ్రెస్‌కు పదేళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో కొనసాగింది కాంగ్రెస్ సర్కార్.. 2014, 2019లలో మొత్తం సీట్లలో 10శాతం దక్కించుకోలేకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. ఈసారి ఆ హోదా దక్కింది.

ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన ప్రత్యేక రికార్డు రాహుల్‌ గాంధీతో పాటు, ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ, తల్లి సోనియా గాంధీకి దక్కినట్లయింది. ఏడు, ఎనిమిది లోక్‌సభలతో పాటు, 16, 17 లోక్‌సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలెవరూ లేరు.

రాహుల్‌ గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో అమేథీ, వయనాడ్‌ నుంచి పోటీ చేసి..అమేథీలో ఓడిపోయి వయనాడ్‌లో గెలిచారు. 2024లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి ఆ రెండు నియోజక వర్గాల్లోనూ విజయం సాధించారు. వయనాడ్‌కు రాజీనామా చేసి.. తన తాత, నాయనమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద యుద్ధం.. అసలేంటీ వివాదం? ఎందుకింత దుమారం?