Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్‌ నేతలతో పాటు మంత్రులు కూడా..

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు

Congress Party

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీని వీడుతుడటం.. వారంతా బీజేపీ గూటికి చేరడం హస్తం పార్టీకి గట్టి దెబ్బగా మారింది. తాజాగా.. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఏకైక ఎంపీ గీతా కోడాతోపాటు.. తమిళనాడులో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే విజయధరణి కూడా కమల దళంలో చేరిపోయారు. మరోవైపు.. కర్నాటక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రులు సైతం విముఖత చూపిస్తుండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద చిక్కులే వచ్చి పడ్డాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తే.. సొంత పార్టీ నేతలే వరుస షాక్‌లు ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. గతంలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్‌ నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌, కేంద్ర మాజీ మంత్రి మింలిద్‌ దేవ్‌రా, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు.

తాజాగా.. ఝార్ఖండ్‌లోని సింగ్భుం ఎంపీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీతాకోడా కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాంచీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పొత్తుల పట్ల అసంతృప్తిగా ఉన్న గీత… తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. 2009లో భర్త మధు కోడా స్థాపించిన జై భారత్‌ సమంతా పార్టీలో చేరిన గీత… జగన్నాథ్‌పూర్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె.. గత ఎన్నికల్లో సింగ్భుం ఎంపీగా గెలుపొందారు. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌ గెలుపొందిన ఏకైక ఎంపీ స్థానం ఇదే. తాజాగా.. గీతా కోడా కూడా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ తగిలింది.

తమిళనాట?
ఇక తమిళనాట సైతం ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యేను చేజార్చుకుంది కాంగ్రెస్‌ పార్టీ. విలవన్‌ కోడ్‌ ఎమ్మెల్యేగా ఉన్న విజయధరణి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా.. కాంగ్రెస్‌లో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆమె మండిపడ్డారు.

పార్టీ పదవులు దక్కకుండా సీనియర్లు అడ్డు పడుతున్నారని.. దాన్ని భరించలేకే పార్టీలో చేరిన 37 ఏళ్ల తర్వాత బయటకు రావాల్సి వచ్చిందని ప్రకటించారామె. అంతేకాదు.. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విజయధరణి ప్రకటించడంతో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది.

సమావేశానికి మంత్రులు డుమ్మా
మరోవైపు కర్నాకటలో అధికారంలో ఉన్నా… కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద చిక్కులే వచ్చి పడ్డాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్‌ నేతలతో పాటు మంత్రులు కూడా ముందుకు రాకపోవడం హస్తం పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతోంది.

ఇటీవల కర్నాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాశంగా మారింది. దీనికితోడు మీటింగ్‌కు హాజరైన నేతలు కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేమని ప్రకటించడంతో అధిష్టానం అయోమయంలో పడింది.

అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ వ్యవహారం కాస్తా కర్నాటక కాంగ్రెస్‌లో చిచ్చు రేపేలా కనిపిస్తోంది. మంత్రి మహదేవప్ప చామరాజనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్‌ ఇటీవల కోరారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ వ్యాఖ్యానించారు.

మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల నాటికి ఇంకా ఎంత మంది ముఖ్య నేతలు హస్తం పార్టీని వీడి.. కమలం గూటికి చేరుతారో వేచి చూడాల్సిందే.

దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్.. మోదీ హయాంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు..