ఉప ఎన్నికలు: హర్యానాలో బీజేపీ, రాజస్ధాన్‌లో కాంగ్రెస్ విజయం

హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఓటమి పాలయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు.
ఈ పోరులో కాంగ్రెస్ సహా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(INLD), జననాయక్ జనతా పార్టీల నుంచి హేమాహేమీలు బరిలో దిగినప్పటికీ తాను వారందరినీ ఓడించానని మిద్దా తెలిపారు.
మరోవైపు రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించారు. దీంతో రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య వందకు చేరింది.