ప్రజలను దోచుకోవడానికే మహాకూటమి – మోడీ

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 12:59 AM IST
ప్రజలను దోచుకోవడానికే మహాకూటమి – మోడీ

ఢిల్లీ : జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు తనను గద్దె దించడం కోసమే తప్ప దేశం కోసం కాదని…ప్రజలను  దోచుకోవడానికే కూటమి గడుతున్నారని భారత ప్రధాన మంత్రి నరంద్ర మోడీ వెల్లడించారు. ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను ‘ప్రజలు-మహాకూటమి’ మధ్య జరిగే పోటీగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ప్రజలు, మహాకూటమి మధ్యే 2019 ఎన్నికలు జరుగుతాయన్నారు.

మహాకూటమికి ఘోర పరాభవం…
ఈ ఎన్నికల్లో దేశ ప్రజలకు తమపైనే విశ్వాసం ఉంచుతారన్నారు. తెలంగాణలో మహాకూటమి ఘోరంగా విఫలమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై ఎవరు చర్చించడం లేదని మోడీ అన్నారు. త్రిపుర, కశ్మీర్‌లోనూ మహాకూటమికి ఘోర పరాభవం ఎదురైందని… తెలంగాణలో మహాకూటమిని ప్రజలు చిత్తుగా ఓడించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదెవరో వచ్చే ఎన్నికలే చెబుతాయని తెలిపారు. 

బాబుపై మోడీ ఆరోపణలు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనక ప్రధాని మోడీ ఉన్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు మోడీ స్పందించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ఘన విజయం సాధించడంతో చంద్రబాబు ద్వేషభావంతో అలా వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌ పంచన చేరారని మండిపడ్డారు.