బీజేపీ రామాయణం పాత్రలు : రాహుల్ రావణుడు, ప్రియాంక శూర్పణఖ

మధ్యప్రదేశ్ : రాహుల్, ప్రియాంకా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని రామాయణంతో పోల్చారు. రాహుల్ ఓ రావణాసురుడు అనీ.. ప్రియాంక శూర్ఫణఖ అని వ్యాఖ్యానించారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం ఆసరాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓ పద్దతి.. పాడూ లేదనీ, రాజకీయ విధానం ఏదీ లేదన్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి తీసుకొచ్చినా మునిగిపోయే నావలా ఉన్న కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు.
రాముడిని ఎదుర్కొనేందుకు రావణాసురుడు మొదట ఆయన సోదరి శూర్పణఖను పంపాడనీ.. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల క్రమంలో ఇప్పుడు రాహుల్ కూడా మోదీని ఎదుర్కొరేందుకు శూర్పణఖలాంటి ప్రియాంకను ఎన్నికల బరిలోకి తీసుకొచ్చారని సురేంద్రసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ట్రాన్స్ జెండర్ గా అభివర్ణిస్తూ ఎమ్మెల్యే సాధనాసింగ్ చేసిన వ్యాఖ్యలను సురేంద్ర సింగ్ సమర్థించారు. ఆత్మగౌరవం లేనివారిని ట్రాన్స్ జెండర్ అంటారని… సమాజ్ వాదీ పార్టీతో జతకట్టడం ద్వారా తనకు ఆత్మగౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని చెప్పారు.