కమ్యూనిటీ హాల్స్, అపార్టుమెంట్స్ లో కరోనా రూమ్స్

కరోనా వైద్యం భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపింది. గేటెడ్ కమ్యూనిటీల్లో, మల్టీ స్టోర్డ్ అపార్టుమెంట్లలో, వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలనీల్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లను, గదులను లేదా కమ్యూనిటీ హాల్‌ను కరోనా రోగుల కోసం కేటాయించి వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందించవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం (జులై 17, 2020) మార్గదర్శకాలు విడుదల చేసింది.
మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న రోగులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించే వ్యూహంలో భాగంగా అపార్టుమెంట్లలో కొంత స్థలాన్ని రోగులకు కేటాయించాలని వెల్లడించింది. కరోనా అనుమానితులు, కరోనా వచ్చినా లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి అపార్టుమెంట్‌లోని ఎవరికీ ఇబ్బంది లేని అనువైన చోట కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని సూచించింది. దాన్నొక విభాగంగా భావించి ప్రత్యేక ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
అయితే చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతరత్రా రోగాలు ఉన్నవారికి మాత్రం ఈ ప్రత్యేక ఏర్పాటు కుదరదని స్పష్టం చేసింది. స్థానిక వైద్య అధికారుల, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకొని కాలనీ సంఘాలు తమ తమ అపార్టుమెంట్లలో ప్రత్యేక కరోనా బస, వసతులు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించింది.