Covid 19 New Variants: దేశంలో కరోనా కలకలం.. కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో హైఅలర్ట్..

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది.

Covid 19 New Variants: దేశంలో కరోనా కలకలం.. కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో హైఅలర్ట్..

Corona Cases (2)

Updated On : May 24, 2025 / 4:42 PM IST

Covid 19 New Variants: దేశంలో మరోసారి కరోనా కల్లోలం రేగింది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్లు వెలుగుచూశాయి.

కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7లను భారత్ లో (తమిళనాడు, గుజరాత్) గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియం(INSACOG) డేటా వెల్లడించింది. ఈ వేరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం సింగపూర్ లో ఎక్కువగా ఉంది. జ్వరం, ముక్కు కారడం, గొంతు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా నెలల తర్వాత ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

కోవిడ్-19 వేరియంట్ NB.1.8.1 రకం కేసు ఒకటి, LF.7 రకం నాలుగు కేసులు కనుగొనబడినట్లు INSACOG డేటా తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ నుండి కూడా ఇటీవల కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో ఒకటి నిర్ధారించబడ్డాయి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి పాజిటివ్ గా వచ్చింది. కేరళలో ఒక్క మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అనేక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నివారణ చర్యలను ముమ్మరం చేసింది.

Also Read: బాబోయ్.. నాలుగు రోజుల్లో గోల్డ్ రేటు అంత పెరిగిందా..! హైదరాబాద్‌లో ప్రస్తుతం 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే..

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ మరొక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్‌గా పరిగణించబడుతున్నప్పటికీ.. పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలి. అనవసరమైన సమావేశాలను నివారించాలి. ఇటువంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

LF.7, NB.1.8 సబ్‌వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ మానిటర్ చేస్తోంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్‌లు ఇవే అని నివేదించబడింది. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసును గుర్తించారు. మేలో గుజరాత్‌లో LF.7 రకం నాలుగు కేసులు కనుగొనబడ్డాయి. భారత్ లో అత్యంత సాధారణ వేరియంట్ JN.1గా ఉంది. ఇందులో పరీక్షించిన నమూనాలలో 53 శాతం, తర్వాత BA.2 (26 శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లీనేజ్‌లు (20 శాతం) ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్‌కు చెందిన ఒక వైద్యుడితో సహా ఇద్దరు మహిళలకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ హై అలర్ట్ జారీ చేసింది. అధికారుల ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఇటీవల ఇతర రాష్ట్రాల నుండి ఉత్తరాఖండ్‌కు ప్రయాణించారు. రిషికేశ్‌కు వచ్చిన గుజరాత్‌కు చెందిన 57 ఏళ్ల మహిళలో కరోనావైరస్ లక్షణాలు కనిపించాయి. పరీక్షల తర్వాత, ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారించబడింది. రెండవ రోగి బెంగళూరుకు చెందిన డాక్టర్. ఆమె ఇంట్లో చికిత్స పొందుతోంది. గత 20 రోజుల్లో బెంగళూరులో కోవిడ్-19 వ్యాప్తి పరంగా క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది.

ఏపీలో నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఒక్క విశాఖపట్నంలోనూ మూడు కేసులు బయటపడ్డాయి. మరొక కేసు రాయలసీమలో వెలుగుచూసింది. విశాఖలో తొలి కేసుకు సంబంధించి.. ఆ వ్యక్తి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు. జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులను అలర్ట్ చేశారు.