నేడే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు!

నేడే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు!

Updated On : January 1, 2021 / 10:08 AM IST

Corona vaccine approved in India today : భారత్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం.. రానే వచ్చింది. కరోనా పరిచిన కారుమబ్బులను చీల్చుకుంటూ.. వ్యాక్సిన్‌ కాంతులతో కొత్త సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పేందుకు భారత్‌ సిద్ధమైంది. కరోనా కక్కిన విషానికి కుదేలైన దేశ ప్రజలకు అమృతం లాంటి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గడియలు దగ్గర పడ్డాయి. వ్యాక్సిన్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న భారతీయులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది. కరోనాతో 2020 సంవత్సరం అంతా విసిగిపోయిన ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పబోతోంది.

అన్ని అనుకున్నట్లే జరిగితే రెండు కరోనా వ్యాక్సిన్లకు ఈరోజే కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ -కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ -ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో పాటు అర్జెంటినా ఇప్పటికే ఆమోదం తెలిపాయి.

వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌లు సమర్పించిన దరఖాస్తులను నిపుణుల కమిటీ ఇప్పటికే పరిశీలించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించి పరీక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై పునః సమీక్షించేందుకు ఇవాళ నిపుణుల కమిటీ సమావేశం కానుంది. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను యూకే ఆమోదించడంపై సీరం హర్షం వ్యక్తం చేసింది. భారత్‌లోనూ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని ఆ కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం, ప్రభావవంతమైనదని ఈ టీకాకు ఆమోదం తెలిపిన మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ గేమ్‌చేంజర్‌గా మారనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వ్యాక్సినేషన్‌తో 2021 వేసవిలోగా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూకేలో బీభత్సం సృష్టిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్‌పైనా ఈ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేయగలదని ఆస్ట్రాజెనెకా ఇప్పటికే స్పష్టం చేసింది.

మరోవైపు భారత్ బయోటెక్‌ అత్యవసర వినియోగానికి కూడా రేపే అనుమతులు వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ ట్రయల్‌ ఫలితాలపై డ్రగ్‌ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సానుకులంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాదిలో ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ ఇచ్చేలా భారత్‌ బయోటెక్‌ ప్రణాళికలు రచిస్తోంది. అలా చేస్తే కోవాగ్జిన్ టీకా మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రకటించడం దానికి అడ్వంటేజ్‌గా మారింది. సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్‌గా కోవాగ్జిన్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది.

కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించింది. నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్‌ సక్సెస్‌ అయింది. దీంతో రేపటి నుంచి దేశమంతా డ్రై రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. డ్రై రన్‌ పూర్తి అవ్వగానే వ్యాక్సినేషన్‌ స్టార్ట్ అవుతుంది. టీకా ఇచ్చే క్రమంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, వ్యాక్సిన్ అనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విషయంలో ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించారు. వీటితో పాటు కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అదుపు చేసే విధానం అమలును ప్రత్యక్షంగా చూశారు.

మొన్న జరిగిన ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలోనే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయిని అందరూ భావించారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో పాటుగా భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఫైజర్ కంపెనీని అదనపు డేటా పంపాలని కేంద్రం కోరింది. ఇక ఈ మూడు వ్యాక్సిన్లపై ఎక్స్‌పర్ట్ కమిటీ కొత్త సంవత్సరం రోజున నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయాన్ని బట్టి కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాక్సిన్లపై ఓ ప్రకటన చెయ్యొచ్చు. అయితే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్కదానికే అనుమతి ఇస్తారా లేదంటే మూడు వ్యాక్సిన్లకు అనుమతులు ఇస్తారో తెలియలంటే మరి కొన్ని గంటలు ఓపిక పట్టక తప్పదు.