భారత్‌కి భారీ ముప్పు పొంచి ఉందా..? వచ్చే 3 నెలల్లో కరోనా విశ్వరూపం తప్పదా? వైరస్ సైలెంట్‌ వేవ్‌ను తప్పించుకునేదెలా?

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 01:06 PM IST
భారత్‌కి భారీ ముప్పు పొంచి ఉందా..? వచ్చే 3 నెలల్లో కరోనా విశ్వరూపం తప్పదా? వైరస్ సైలెంట్‌ వేవ్‌ను తప్పించుకునేదెలా?

Updated On : November 6, 2020 / 2:16 PM IST

coronavirus big danger to india: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి తలెత్తుతుయా అంటే.. ఔననే అంటున్నారు. ఇప్పుడు కాస్త తగ్గిన కరోనా కేసులు వచ్చే మూడు నెలలూ భారీగా పెరుగుతాయని.. అప్రమత్తంగా లేకపోతే కేసుల సంఖ్య లక్షలకి లక్షలు నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్:
కరోనా సెకండ్ వేవ్ వస్తోంది.. రికవరీలు చూసి సంబరపడొద్దు.. రాబోతోన్న రెండో దశ మరింత ప్రమాదం.. రావడమేంటి కరోనా అప్పుడే తన ప్రతాపం చూపిస్తోంది కూడా..దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా ఒక్క రోజులోనే ఐదారువేల కేసులు నమోదవుతున్నాయ్. అసలు కరోనా విస్తరణ ప్రారంభమైన సమయంలో వైరస్ కేసులు ఇక్కడ విపరీతంగా పెరిగినా..ఆ తర్వాత కంట్రోల్‌లో ఉన్నాయ్.. ఐతే ఒక్క పదిహేనురోజుల్లో సీన్ మారిపోయింది. రోజూ కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడంతో..కంటైన్మెంట్ జోన్లు పెరిగిపోయాయ్.. దీనికి కారణం..సెకండ్ వేవ్..కాదు కాదు..థర్డ్ వేవ్ అని ఢిల్లీ ప్రభుత్వమే ప్రకటిస్తోంది. అంతేకాదు పండగ సీజన్‌లో భారీగా గుమిగూడటంపై నిషేధం విధించింది.

చలికాలం రోగాలకు పుట్టినిల్లు, మాస్క్ ధరించడమే అసలైన వ్యాక్సిన్:
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలం వచ్చిందంటే చాలు వణికించే చలి అనేక రోగాలకు పుట్టిల్లుగా మారతాయ్. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ మరింత బలం పుంజుకుంటుందని గత ఆర్నెల్ల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు..దేశీయంగా వైద్యశాఖలు, నిపుణులు కూడా హెచ్చరించారు. దానికి తగ్గట్లుగా ప్రవర్తించాలని సూచనలు వచ్చాయ్..ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే కరోనాకి సంబంధించిన రెండో దశ ప్రారంభమైందని అంటారు..దీనికి ఢిల్లీ కేసులే ఉదాహరణ..మరి ఢిల్లీ అనుభవంతో మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయ్..స్థానికంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు..మాస్క్‌లు ధరించడమే అసలైన వ్యాక్సిన్ అని..దాన్ని
వదిలేయవద్దని చెప్తున్నారు.

జనాల్లో సైలెంట్ గా పాకిన కరోనా:
ఇదే సమయంలో లాక్‌డౌన్ సడలింపులు కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా చెప్పాలి..ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు కూడా తెరిచారు.. ఐతే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, ఏలూరులాంటి కొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో విద్యార్ధులు..ఉపాధ్యాయులకు వైరస్ సోకినట్లు బయటపడింది. ఇది స్కూళ్లు ప్రారంభం కావడంతో చోటు చేసుకున్న పరిణామం అని కాదు.. ఇప్పటికే ఇంతమందిలో వైరస్ నిద్రాణంగా సోకగా..స్కూళ్ల ప్రారంభం సందర్భంగా చేసిన స్క్రీనింగ్ టెస్టుల్లో బయటపడింది..అంటే వైరస్ ఎంత సైలెంట్‌గా జనాల్లో పాకిపోయిందో అర్ధం చేసుకోవాలి.

టీచర్లు, పిల్లలు వైరస్ క్యారియర్లుగా మారే ప్రమాదం:
స్కూళ్ల ప్రారంభంతో విద్యార్ధులకు సోకినా…ఉపాధ్యాయుల నుంచి పిల్లలకు సోకినా..వారంతా క్యారియర్లుగా మారే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది. వైరస్‌ని వారిపై ప్రభావం చూపినా..చూపకపోయినా..వారే వాహకాలుగా మారి ఇళ్లలోని వృద్ధులు..ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఇదే ఇప్పుడు అందరినీ భయపెడుతోన్న అంశం..అంతేకాదు.. చలికాలంలో జలుబు, ఫ్లూలాంటి ఇతర వైరస్‌లే తీవ్రప్రభావం చూపుతాయ్..అలాంటప్పుడు కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు.

భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయా?
పేరేదైనా కరోనా మరోసారి భారత్‌లో తన ప్రతాపం చూపుతుందనడానికి సంకేతాలు వస్తున్నాయ్. గత రెండువారాల్లో లేని విధంగా ఒక్కసారిగా 24 గంటల వ్యవధిలో 50,209 కేసులు నమోదయ్యాయ్. అలానే 24 గంటల వ్యవధిలో 704మంది మరణించారు. మరోవైపు రికవరీ అవుతున్న పేషెంట్ల సంఖ్య భారీగా ఉంది. మొత్తంగా 77లక్షల 11వేల 809మంది బుధవారం(నవంబర్ 4,2020) సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యారు. మరి తాజా సంకేతాలు చూస్తుంటే..మళ్లీ వైరస్ కేసులు పెరగడం ఖాయంగా కన్పిస్తోంది.

వైరస్ వ్యాప్తి తిరిగి ప్రారంభమైందనే అనుకోవాలి:
దీనికి భారీగా చేస్తున్న టెస్టులనే కారణంగా చెప్పడానికి లేదు. వైరస్ వ్యాప్తి తిరిగి ప్రారంభమైందనే అనుకోవాలి…దీనికి ఎలా చెక్ చెప్పాలి..ఇదే ఇప్పుడు అందరి ముందు పెద్ద ప్రశ్న..బాధ్యతారాహిత్యంగా తిరగడమే కాదు జాగ్రత్తలు గాలికి వదిలేయడమే కారణంగా తెలుస్తోంది. దానికి ఉదాహరణగా ఢిల్లీనే చూడాలి. గత వారం లెక్కలను చూస్తే.. అక్టోబర్ 28న 5వేల 673మందికి వైరస్ సోకగా, అక్టోబర్ 29న 5వేల 739మందికి సోకింది. అక్టోబర్ 31న 5వేల 891మందికి మహమ్మారి సోకినట్లు బైటపడింది. ఆ తర్వాత రెండురోజులు అంటే నవంబర్ 1న కాస్త వైరస్ కేసుల సంఖ్య తగ్గి 5వేల 62మందికి సోకింది. నవంబర్ 2న కూడా 24 గంటల వ్యవధిలో 4వేల 001మంది వైరస్ బారిన పడ్డారు. నవంబర్ 3న ఒకేసారి 6వేల 725మందికి వైరస్ సోకింది. నవంబర్ 4న 6వేల 842మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. అంటే వైరస్ ఎక్కడకూ పోలేదు. మనం బైట తిరిగితే దాన్ని ఆహ్వానించినట్లే.