లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిరాశ్రయుల కోసం 35 కొత్త భవనాలు

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భవనాలు నిండి పోయాయి. రవాణా వ్యవస్ధకూడా నిలిచిపోవటంతో అనేక మంది కార్మికులు రాజధానిలో చిక్కుకుపోయారు.
సమీపంలోని గ్రామాలకు వెళ్లగలిగిన వారు అవకాశం ఉన్నంత వరకు వెళ్లగలిగారు.కానీ కొన్ని వేల మంది ఇంకా ఢిల్లీ లోనే చిక్కుకుపోయారు. వీరికోసం కొత్తగా 35 భవనాలు ఎంపిక చేసి వారందరికీ అందులో ఆశ్రయం కల్పిస్తామని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సభ్యుడు బిపిన్ రాయ్ చెప్పారు. నైట్ షెల్టర్ భవనాల వద్ద ఉన్నవారి కోసం సబ్బులు .నీరు, శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నట్లు బిపిన్ రాయ్ చెప్పారు.
ఇప్పటి వరుకు అందిన సమాచారం ప్రకారం జామా మసీదు, యమునా పుష్తా మరియు కాశ్మీర్ గేట్ సమీపంలోని 22 నైట్ షెల్టర్ హోమ్స్ గత రెండు రాత్రులలో వాటి సామర్ధ్యానికి మించి నిండిపోయాయి. వాటిలో రెండు భవనాలు కాగా, మూడు గుడారాలు, మిగిలినవి పోర్టబుల్ క్యాబిన్లు ఉన్నాయి. ఉదాహరణకు, 50 మంది సామర్థ్యం కలిగిన యమునా బజార్‌లోని ఒక ఆశ్రయంలో మార్చి 23 న 90 మంది, మార్చి 24 న 170 మంది ఉన్నారు. నిజాముద్దీన్‌లో 50 మంది సామర్థ్యంతో ఒక గుడారంలో మార్చి 23 న 105 మంది, మార్చి 24 న 119 మంది ఉన్నారు.
నగరంలోని 234 ఆశ్రయాలలో 7,000 మంది ఉన్నారు. ఈ ఆశ్రయాలలో మొత్తం 18,538 మందికి వసతి కల్పించవచ్చు. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటి నుండి అవి పూర్తి స్దాయిలో నిండి ఉన్నాయి అని బిపిన్ రాయ్ వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం అన్నినిరాశ్రయ భవనాల వద్దకు ఉచిత భోజనం సరఫరా చేస్తోంది. వారికి అవసరమైతే ఆర్ధిక సహాయం చేసే అంశాన్ని కూడా ప్రభత్వం పరిశీలిస్తోంది. తాజా నివేదికల ప్రకారం 77 కాంక్రీట్ భవనాలు, 115 పోర్టబుల్ క్యాబిన్లు మరియు 41 గుడారాలలో ప్రస్తుతం నిరాశ్రయులు ఉన్నారని తెలుస్తోంది.