India Coronavirus : బిగ్ రిలీఫ్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.

India Coronavirus : బిగ్ రిలీఫ్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

India Coronavirus Live Updates

Updated On : June 29, 2021 / 10:57 AM IST

India Coronavirus Live Updates : కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. కొత్త కేసులు 40వేల దిగువగా నమోదవగా, మరణాలు వెయ్యి లోపే ఉన్నాయి.

సోమవారం(జూన్ 28,2021) 17లక్షల 68వేల 008 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 37వేల 566 మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు 100 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో క్షీణించాయి. తాజాగా మరో 907 మంది కరోనాతో చనిపోయారు. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం కేసులు 3,03,16,897కి చేరగా.. 3లక్షల 97వేల 637 మంది చనిపోయారు.

నిన్న ఒక్కరోజే 56వేల 994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్ల మార్కును దాటాయి. ప్రస్తుతం 5.52లక్షల యాక్టివ్ కేసులుండగా.. ఆ రేటు 1.82 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది. కరోనా కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గడంతో ప్రజలు, పాలకులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు మాత్రం మర్చిపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత మర్చిపోవద్దన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు అంటున్నాయి.