మార్చి 31వరకూ పంజాబ్ పూర్తిగా లాక్ డౌన్

మార్చి 31వరకూ పంజాబ్ పూర్తిగా లాక్ డౌన్

Updated On : March 22, 2020 / 8:45 AM IST

కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతుంది. పంజాబ్‌లో ఈ ఎఫెక్ట్ ను మరింత తగ్గించేందుకు అక్కడి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మార్చి 31వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలియజేశారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన సేవలు కొనసాగుతాయని చెప్పారు. 

పాలు, ఆహార పదార్థాలు, మందులు వంటి వాటికి ఎటువంటి ఆటంకం ఉంటుందని తెలియజేశారు. జిల్లా అధికారులకు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ నిబంధనలు అమలుచేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ఆయన.. అందుబాటులో ఉండే సర్వీసుల గురించి వివరించారు. పంజాబ్ లోని కొన్ని జిల్లాల్లో కరోనా లక్షణాలు దారుణంగా కనిపిస్తున్నాయి. 

గుజరాత్‌కు చెందిన అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదరాలు సైతం మార్చి 25వరకూ మూసి ఉంచుతామని గుజరాత్ ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం మార్చి 31వరకూ పూర్తి లాక్ డౌన్ ప్రకటించేశారు. అక్కడ కూడా అత్యవససర సేవలు మినహాయించి లాక్ డౌన్ అమలుచేయనున్నారు. 

భారత్ కరోనా మరణాల సంఖ్య 6కి పెరిగింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ… రెండు కరోనా మరణాలు బయటపడ్డాయి. పాట్నాలో 38ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. బీహార్ రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం. ఇప్పటివరకు చనిపోయిన వారంతా వృద్దులే. కానీ ఫస్ట్ టైమ్ 38ఏళ్ల వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది.  

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. ఆరుగురు చనిపోయారు. 30 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.