మహా కూటమిలో పీబీ సింగ్ “లేఖ”ప్రకంపనలు..పవార్ కీలక భేటీ
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.

Corruption Allegations Serious Sharad Pawar On Maharashtra Minister
Corruption Allegations ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. అనిల్ దేశ్‌ముఖ్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన మంత్రులందరికీ ఎన్సీపీ చీఫ్ పవార్ ఆదివారం సమన్లు జారీ చేశారు. అనిల్ దేశ్‌ముఖ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఇవాళ ఢిల్లీలో శరద్ పవార్ తో సమావేశమవనున్నారు. పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్‌తో జరిగే భేటీ తర్వాత నష్టనివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పండరీపుర్ ఉప ఎన్నిక విషయమై చర్చించేందుకు 3 రోజుల క్రితమే పవార్‌తో భేటీని నిర్ణయించినట్లు ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు,శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఇవాళ ఢిల్లీలో పవార్ ని కలవనున్నారు.
ఇక, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేతుల్లో ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇవాళ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అనిల్ దేశ్ ముఖ్ పై ఈ ఆరోపణల సమయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పుడు ఎందుకు? ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించబడ్డ తరువాత పరమ్ బీర్ సీంగ్ ఈ ఆరోపణలన్నీ చేశారు అని శరద్ పవార్ అన్నారు.రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ(శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పవార్ ఆరోపించారు. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలు సంకీర్ణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. మాజీ ఉన్నతాధికారి జూలియో రిబీరో చేత ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని తాను సీఎంకు సూచించనున్నట్లు పవార్ చెప్పారు. దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయని పవార్ పేర్కొన్నారు. రేపు కూటమి నాయకులు సమావేశమై తమ పార్టీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్‌పై నిర్ణయం తీసుకుంటారని పవార్ అన్నారు.
మరోవైపు, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను తన మెయిల్ ఐడీ నుంచే సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపినట్లు ముంబై మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు. లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచి వచ్చిందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. అంతకుముందు, శనివారం ఉదయం 4.37 గంటలకు మెయిల్ వచ్చిందని సీఎం కార్యాలయం తెలిపింది. పరమ్‌బీర్ సింగ్ అధికారిక ఖాతా నుంచి లేఖ రాలేదని పేర్కొంది. ఆయన సంతకం కూడా లేదని వెల్లడించింది. లేఖను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పరమ్‌బీర్ సింగ్ ప్రకటన చేయడం గమనార్హం.
లేఖలో ఏముంది
హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్‌బీర్ సింగ్ సీఎంకి లేఖ రాశారు. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజేకు అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు ఆ లేఖలో సింగ్ తెలిపారు.