Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు తాగిస్తున్నారా.. ఆ వయస్సు వారికి అస్సలు ఇవ్వొద్దు.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు ఇస్తున్నారా.. అయితే, కాస్త జాగ్రత్త. డీజీహెచ్ఎస్ సలహాలను జారీ చేసింది.

Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు తాగిస్తున్నారా.. ఆ వయస్సు వారికి అస్సలు ఇవ్వొద్దు.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

Cough syrup

Updated On : October 4, 2025 / 9:23 AM IST

Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు ఇస్తున్నారా.. అయితే, కాస్త జాగ్రత్త. దేశంలోని పలు రాష్ట్రాల్లో దగ్గు మందులు వికటించి చిన్నారులు మరణిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లల విషయంలో దగ్గు, జలుబు మందులను మోతాదుకు మించి వాడొద్దని స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలో కిడ్నీ సంబంధిత సమస్యతో తొమ్మిది మంది చిన్నారులు, రాజస్థాన్ రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ మరణాలకు దగ్గు మందులోని విషపూరిత రసాయనాలే కారణమని వార్తలు వచ్చాయి. దీంతో చిన్నారుల మృతి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ), కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) ప్రతినిధులతో కూడిన బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెళ్లి దర్యాప్తు చేపట్టింది.

Also Read: పిల్లల్లో టమాటా వైరస్.. లక్షణాలు ఇవే.. వారిని తాకినా, దగ్గరగా ఉన్నా…

చిన్నారుల మృతి, తదితర విషయాలపై ప్రతినిధుల బృందం దర్యాప్తు చేపట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరణించిన చిన్నారులకు సంబంధించిన దగ్గు మందు నమూనాలను పరీక్షించింది. అయితే, దగ్గు మందులో కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసే డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథిలీన్ గ్లైకాల్ (ఈజీ) వంటి ప్రమాదకర రసాయనాలు లేవని తేలింది. రాజస్థాన్ రాష్ట్రంలో మరణించిన ఇద్దరు చిన్నారుల కేసులో పరీక్షించిన మందు నమూనాలలో కూడా ఈ రసాయనాలు లేవని స్పష్టమైంది. అయితే, పిల్లల మరణాలకు, దగ్గు మందులోని రసాయనాలకు ప్రత్యక్ష సంబంధం లేదని పరీక్షలో తేలినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్ఎస్) సలహాలను జారీ చేసింది.

పిల్లల విషయంలో దగ్గు, జలుబు మందులను మోతాదుకు మించి ఇవ్వొద్దని డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. రెండేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు, జలుబు ఇవ్వకూడదని, ఐదేండ్లలోపు పిల్లలకు కూడా సాధారణంగా ఈ మందులను సిఫారసు చేయకూడదని డీజీహెచ్ఎస్ సూచించింది. ఒకవేళ ఐదేళ్ల వయస్సు దాటిన పిల్లలకు ఇవ్వాల్సి వస్తే వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతుదులో, అతి తక్కువ కాలం మాత్రమే ఇవ్వాలని డీజీహెచ్ఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

దగ్గు, జలుబు సమయాల్లో మందులకు బదులుగా పిల్లలకు తగినంత విశ్రాంతినివ్వడం, లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడం వంటి సహజ పద్దతులను పాటించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.